
T20i Cricket: క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనేది పెద్ద అవార్డుగా ఆటగాళ్లు భావిస్తుంటారు. తొలి రోజుల్లో అత్యధిక పరుగులు చేసిన లేదా ఎక్కువ వికెట్లు తీసిన బ్యాట్స్‌మన్ లేదా బౌలర్‌కు ఈ అవార్డ్ ఇచ్చేవారు. కానీ, కాలక్రమేణా ఈ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు ఆటగాడి ప్రదర్శనే కాదు.. మ్యాచ్ ప్రభావాన్ని, పరిస్థితిని బట్టి ఇస్తున్నారు. తమ అద్భుతమైన ఫీల్డింగ్ కారణంగా చాలా సార్లు ఆటగాళ్లకు ఈ అవార్డు లభించింది.
T20 మ్యాచ్‌లలో, స్ట్రైక్ రేట్ ఆధారంగా బ్యాట్స్‌మెన్‌లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఫార్మాట్‌లో మీరు నెమ్మదిగా బ్యాటింగ్ చేయలేరు. కాబట్టి, ఈ ఫార్మాట్‌లో స్ట్రైక్ రేట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్ ఆడే చిన్న ఇన్నింగ్స్ అయినా.. ఆ దూకుడు ప్రభావం రెండు జట్ల మధ్య వ్యత్యాసాన్ని సృష్టిస్తాయి. ఈ రోజు మనం T20 ఇంటర్నేషనల్‌లో 8 లేదా అంతకంటే తక్కువ బంతులు ఆడిన తర్వాత కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
T20Iలో 8 లేదా అంతకంటే తక్కువ బంతులు ఆడిన ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. అయితే, ఈ లిస్టులో టీమిండియా నుంచి ఓ బ్యాటర్ కూడా ఉన్నాడని మీకు తెలుసా? ఆ విషయాలు కూడా ఇప్పుడు చూద్దాం..
బ్రాడ్ హాడ్జ్ తన T20 అంతర్జాతీయ కెరీర్‌లో ఆస్ట్రేలియా తరపున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ఒక్కసారి మాత్రమే గెలుచుకున్నాడు. 2014లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ అవార్డును గెలుచుకున్నాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను కేవలం 7 ఓవర్లకు కుదించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాకు 81 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా స్కోరు ఒకానొక సమయంలో 60 పరుగులకు 5 వికెట్లుగా నిలిచింది. అక్కడి నుంచి బ్రాడ్ హాడ్జ్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి కేవలం 8 బంతుల్లో 21* పరుగులు చేసి 2 బంతులు మిగిలి ఉండగానే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో కీలకంగా మారాడు. అతని అద్భుతమైన ఫినిషింగ్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ని ఎవరు మర్చిపోగలరు. ఈ ముక్కోణపు సిరీస్‌లో చివరి మ్యాచ్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగింది. ఇక్కడ దినేష్ కార్తీక్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో చివరి బంతికి భారత్‌ను గెలిపించాడు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ విజయానికి చివరి 2 ఓవర్లలో 34 పరుగులు అవసరం. కాగా, దినేష్ కార్తీక్ 19వ ఓవర్లో రూబెల్ హసన్‌ను 22 పరుగుల వద్ద కొట్టడంతో విషయం చివరి ఓవర్‌కు చేరింది.
చివరి బంతికి భారత్ విజయానికి 5 పరుగులు అవసరం. కాగా, దినేష్ కార్తీక్ అద్భుత సిక్సర్ కొట్టి భారత్ కు ఉత్కంఠ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కార్తీక్ కేవలం 8 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో 8 బంతుల కంటే తక్కువ ఆడినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి ఆటగాడిగా ఆసిఫ్ అలీ నిలిచాడు. టీ20 ప్రపంచకప్ 2021 గ్రూప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై అతను ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు చివరి 2 ఓవర్లలో 24 పరుగులు అవసరం కాగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఆసిఫ్ అలీ పాక్ గెలుపు బాధ్యతను తీసుకున్నాడు. 19వ ఓవర్‌లోనే కరీం జనత్‌పై 4 అద్భుతమైన సిక్సర్లు కొట్టి పాకిస్థాన్‌కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతను 7 బంతుల్లో 25* పరుగులతో నిలిచాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..