Kane Williamson: కేన్ మామ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్ బై.. వారసుడిగా కోహ్లీ టీమ్‌మేట్!

|

Dec 15, 2022 | 8:56 AM

పాకిస్థాన్ పర్యటనకు ముందు న్యూజిలాండ్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల..

Kane Williamson: కేన్ మామ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీకి గుడ్ బై.. వారసుడిగా కోహ్లీ టీమ్‌మేట్!
Kane Williamson
Follow us on

పాకిస్థాన్ పర్యటనకు ముందు న్యూజిలాండ్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కేన్ విలియమ్సన్ తప్పుకున్నాడు. కేన్ మామ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంతో న్యూజిలాండ్ క్రికెట్ టీంలో 67 ఏళ్ల తర్వాత మళ్లీ ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. విలియమ్సన్ స్థానంలో టిమ్ సౌథీ టెస్టుల్లో నాయకత్వం వహించనున్నాడు. ఐపీఎల్‌లో సౌథీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇక సౌథీకి డిప్యూటీగా లాథమ్ వైస్ కెప్టెన్‌ బాధ్యతలు స్వీకరిస్తాడు.

2016లో బ్రెండెన్‌ మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత కివీస్‌కు అన్ని ఫార్మాట్లలోనూ సారధ్య బాధ్యతలను స్వీకరించాడు కేన్ విలియమ్సన్. ఈ ఆరేళ్లలో జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. అంతేకాదు కేన్ మామ సారధ్యంలోనే కివీస్ 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ గెలుచుకుంది. 32 ఏళ్ల విలియమ్సన్ 40 టెస్టు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించాడు, అందులో అతడు 22 మ్యాచ్‌ల్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 8 టెస్టులు డ్రా కాగా, 10 టెస్టుల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది.

‘నేను టెస్ట్ క్రికెట్‌లో సవాళ్లను ఎప్పుడూ ఇష్టపడతాను. జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేను ఎన్నో ఎదుర్కొన్నాను. కెప్టెన్‌గా ఉన్నప్పుడు మైదానం లోపల, వెలుపల ఒత్తిడి ఉంటుంది. నా కెరీర్‌లో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. రాబోయే 2 సంవత్సరాలలో రెండు వైట్‌బాల్ క్రికెట్ ప్రపంచకప్‌లు ఉన్నాయి, వాటిని దృష్టిలో ఉంచుకుని, నేను న్యూజిలాండ్ క్రికెట్‌ బోర్డుతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా‘ అని విలియమ్సన్ పేర్కొన్నాడు.

ఈ నిర్ణయంతో ఇకపై కేన్‌ మామ టీ20లు, వన్డేలకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్ టెస్టు జట్టు బాధ్యతలను సౌథీ చేపట్టగా.. ఓ  ఫాస్ట్ బౌలర్ సారధ్యం వహించడం ఇది రెండోసారి. దీనికి ముందు, 1955 సంవత్సరంలో, హ్యారీ కేవ్ పాకిస్తాన్ పర్యటనతో దీర్ఘకాలిక టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కాగా, వచ్చే వారం న్యూజిలాండ్ జట్టు కరాచీ వెళ్లనుంది. డిసెంబర్ 26 నుంచి పాకిస్థాన్‌తో తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జనవరి 3 నుంచి రెండో టెస్టు జరగనుంది. అనంతరం జనవరి 10 నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.