Joe Root : మాంచెస్టర్ టెస్ట్‌లో భారత బౌలర్లకు చుక్కలు.. రికార్డుల మోత మోగించిన జో రూట్

మాంచెస్టర్ టెస్ట్ మూడో రోజు, జో రూట్ 150 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించగా, ఇంగ్లాండ్‌కు 186 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు సాధించింది.

Joe Root : మాంచెస్టర్ టెస్ట్‌లో భారత బౌలర్లకు చుక్కలు.. రికార్డుల మోత మోగించిన జో రూట్
Joe Root

Updated on: Jul 26, 2025 | 9:15 AM

Joe Root : మాంచెస్టర్ టెస్ట్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లాండ్‌కు ఇప్పుడు మొత్తం 186 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ బెన్ స్టోక్స్ 77 పరుగులతో క్రీజులో ఉండగా, అతనితో పాటు లియామ్ డాసన్ కూడా గట్టిగా నిలబడి ఉన్నాడు. మూడో రోజు ఇంగ్లాండ్ తమ స్కోర్‌ను 225/2 నుంచి కొనసాగించింది. మొదటి సెషన్‌లో జో రూట్ , ఆలీ పోప్ భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరూ కలిసి 144 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను బ్యాక్‌ఫుట్‌లోకి నెట్టారు. లంచ్ తర్వాత భారత కెప్టెన్ స్పిన్నర్లపై నమ్మకం ఉంచి వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాకు వికెట్లు తీసే బాధ్యతను అప్పగించాడు. సుందర్ ఈ వ్యూహాన్ని నిజం చేస్తూ ఆలీ పోప్‌ను 71 పరుగుల వద్ద ఔట్ చేశాడు. ఆ కొద్దిసేపటికే సుందర్, హ్యారీ బ్రూక్ ను కూడా పెవిలియన్ పంపాడు.

భారత్ మ్యాచ్‌లోకి తిరిగి వస్తున్నట్లు కనిపించినా, జో రూట్, బెన్ స్టోక్స్ ల భారీ భాగస్వామ్యం టీమిండియాను మళ్ళీ బ్యాక్‌ఫుట్‌లోకి నెట్టింది. మ్యాచ్ మధ్యలో బెన్ స్టోక్స్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్ళాడు. కానీ, వికెట్లు పడటం మొదలైన తర్వాత అతను మళ్ళీ బ్యాటింగ్‌కు వచ్చి క్రీజులో నిలబడ్డాడు. జో రూట్ 150 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అనేక రికార్డులను సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్, జాక్ కల్లిస్, రికీ పాంటింగ్ లను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. దీంతో పాటు, టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక సెంచరీలు (12) సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కూడా రూట్ నిలిచాడు. రూట్ 150 పరుగుల వద్ద స్టంప్ ఔట్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టు కనీసం 250 పరుగుల ఆధిక్యం వైపు దూసుకుపోతోంది.

భారత బౌలింగ్ విషయానికొస్తే, జస్‌ప్రీత్ బుమ్రా లయ తప్పినట్లు కనిపించాడు. అతని బౌలింగ్ వేగం కూడా తగ్గింది. అరంగేట్రం చేసిన అంశుల్ కంబోజ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటివరకు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా, అంశుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్ చెరో ఒక వికెట్ సాధించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..