IND vs BAN: ఆల్‌రౌండ్‌ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన జెమీమా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం.. ఆఖరి వన్డేలో తాడో పేడో..

ఢాకాలోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన 2వ వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఉమెన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.

IND vs BAN: ఆల్‌రౌండ్‌ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన జెమీమా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం.. ఆఖరి వన్డేలో తాడో పేడో..
Team India

Updated on: Jul 19, 2023 | 7:08 PM

ఢాకాలోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన 2వ వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఉమెన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ ప్రియా పునియా కేవలం 7 పరుగుల వద్ద ఔట్ కాగా, ఆ తర్వాత యాస్తిక భాటియా (15) కూడా వికెట్ కోల్పోయింది. స్మృతి మంధాన 36 పరుగులు చేసి రబియా బౌలింగ్‌లో వెనుదిరిగింది.ఈ దశలో హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ 4వ వికెట్‌కు 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హర్మన్‌ప్రీత్ కౌర్ (52) పరుగులు చేయగా.. జెమీమా 78 బంతుల్లో 9 ఫోర్లతో 86 పరుగులు చేసింది. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.

బౌలింగ్‌లోనూ అదుర్స్‌..

229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలో ముర్షిదా ఖాతున్ (12) వికెట్ తీసింది మేఘన. దీప్తి శర్మ, స్నేహ రాణా కూడా రాణించడంతో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది బంగ్లాదేశ్. అయితే  ఫర్గానా (47) జట్టుకు అండగా నిలిచింది . ఈ దశలో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్ బంగ్లాదేశ్ జట్టు మిడిలార్డర్‌ ను కుప్పకూల్చింది. తన స్పిన్‌తో ఆతిథ్య జట్టుకు ముచ్చెమటలు పట్టించిన జెమీమా 3.1 ఓవర్లలో 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. ఫలితంగా బంగ్లాదేశ్ జట్టు 35.1 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌటైంది. తద్వారా టీమిండియా 108 పరుగుల భారీ విజయాన్ని సాధించి సిరీస్ పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. 3 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది, శనివారం జరిగే చివరి వన్డేలో గెలిచిన జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

 

టీమ్ ఇండియా ప్లేయింగ్ 11:

ప్రియా పునియా, స్మృతి మంధాన, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్జ్, హర్లీన్ డియోల్, అమంజోత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, దేవికా వైద్య, మేఘనా సింగ్.

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11:

ముర్షిదా ఖాతున్, షర్మిన్ అక్తర్, ఫెర్గానా హోక్, నిగర్ సుల్తానా (కెప్టెన్), రీతు మోని, రబియా ఖాన్, లతా మోండల్, నహిదా అక్తర్, ఫాహిమా ఖాతున్, సుల్తానా ఖాతున్, మారుఫా అక్తర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..