నేటి నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. వాస్తవానికి గత ఏడాది భారత్-ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరిగింది. అప్పుడు ఐదవ టెస్ట్‌కు ముందు కరోనా కేసుల కారణంగా ఈ మ్యాచ్‌ను నిర్వహించలేదు. దీంతో చివరి టెస్టును ఈ రోజు నుంచి నిర్వహించనున్నారు. ప్రస్తుతం సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్ ఇండియా రికార్డులు చూస్తే, ఈ టెస్ట్ మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుందో ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ స్టేడియంలో భారత జట్టు టెస్ట్ రికార్డు ఇప్పటివరకు చెత్తగా ఉంది. ఈ స్టేడియంలో టీమ్ ఇండియా ఇప్పటి వరకు 7 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒక్కటి కూడా గెలవలేకపోయింది.
1967లో ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి టెస్టు ఆడిన భారత్..
భారత జట్టు తన తొలి టెస్టు మ్యాచ్‌ను జులై 1967లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఆడింది. 132 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత 55 ఏళ్లుగా ఈ మైదానంలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. అయితే, ఒకసారి టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో విజయం సాధించింది. ఈ మ్యాచ్ 1986లో జరిగింది.
ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా టెస్టు రికార్డు..
మొత్తం టెస్ట్ మ్యాచ్‌లు: 7
గెలిచినవి: 0
ఓడిపోయినవి: 6
డ్రా: 1
కోహ్లీ సారథ్యంలో టెస్టు సిరీస్ ప్రారంభమైంది..
గతేడాది విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ను ప్రారంభించింది. అయితే, తొలి 4 మ్యాచ్‌ల్లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో నిలిచింది. కోవిడ్ కారణంగా ఐదో టెస్ట్ వాయిదా పడింది. దీని తర్వాత, అదే సంవత్సరం ప్రారంభంలో అంటే 2022, కోహ్లీ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
కాగా, రోహిత్ కూడా ఈ పర్యటనకు వచ్చాడు. అయితే కరోనా పాజిటివ్ కారణంగా అతను టెస్ట్ మ్యాచ్ నుంచి నిష్క్రమించాడు. గాయం కారణంగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో రాహుల్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్ గైర్హాజరీతో ప్రస్తుతం బుమ్రాకు కెప్టెన్సీ దక్కింది. ఇప్పుడు బుమ్రా కెప్టెన్సీలో భారత్ మ్యాచ్ గెలవడం కఠినమైన సవాలును ఎదుర్కోనుంది.
మెకల్లమ్ కోచింగ్‌లో దూకుడు పెంచిన ఇంగ్లాండ్..
అదే సమయంలో, ఇటీవల ఇంగ్లండ్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సారథ్యంలోని న్యూజిలాండ్‌ను 3-0తో ఓడించింది. అలాగే కొత్త కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గదర్శకత్వంలో ఇంగ్లండ్ జట్టు చాలా దూకుడుగా రాణిస్తోంది. ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి బౌలర్లను భీకరంగా ఓడించగా, జాక్ లీచ్ ఇన్నింగ్స్‌లో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
జో రూట్ ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టినప్పటి నుంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే IPL నుంచి ఫామ్‌ను సంపాదించిన జానీ బెయిర్‌స్టో 120కి పైగా సగటుతో 400 పరుగులు చేసి సత్తా చాటుతున్నాడు.
కీలక టెస్టుకు ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏం చెప్పాడంటే?
ఎడ్జ్‌బాస్టన్‌లోని పిచ్ ఫ్లాట్‌గా కనిపిస్తోంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు సహాయకరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేయాల్సిన బాధ్యత బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లపై ఉంది.
భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ బుధవారం మాట్లాడుతూ, ‘ఇంగ్లండ్ ఓటమికి చేరువగా వెళ్లి రెండు మ్యాచ్‌లు గెలిచింది. అయితే, వారి బలం గురించి ఆలోచించకుండా, మేం మా బలంపై దృష్టి పెడతాము’ అంటూ చెప్పుకొచ్చాడు.