IND vs ENG: బుమ్రా వచ్చాడంటే అదరగొట్టేస్తాడంతే..! తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఆలౌట్‌

మూడవ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 7 బంతుల్లో 3 కీలక వికెట్లు (బెన్ స్టోక్స్, జో రూట్, క్రిస్ ఓక్స్) తీయడంతో పాటు మరో వికెట్ సాధించి అదరగొట్టాడు. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

IND vs ENG: బుమ్రా వచ్చాడంటే అదరగొట్టేస్తాడంతే..! తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఆలౌట్‌
Jasprit Bumrah

Updated on: Jul 11, 2025 | 7:37 PM

క్రికెట్‌ మక్కా లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా అదరగొట్టేశాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల హాల్‌ సాధించిన బుమ్రా.. ఆ తర్వాత రెండో టెస్టులకు రెస్ట్‌ తీసుకొని.. ఇప్పుడు మూడో టెస్టు బరిలోకి దిగి మరో 5 వికెట్ల హాల్‌తో దుమ్మురేపాడు. తొలి రోజు ఆటలో కేవలం ఒక్కటే వికెట్‌ తీసిన బుమ్రా రెండో రోజు ఆట ఆరంభంలోనే అదరగొట్టాడు. కేవలం 7 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టాడు. అది కూడా బెన్‌ స్టోక్స్‌, జో రూట్‌, క్రిస్‌ ఓక్స్‌ను పెవిలియన్‌ చేర్చాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్‌ అవుట్‌ చేయడంతో ఐదు వికెట్ల హాల్‌ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు హ్యారీ బ్రూక్‌ను అవుట్‌ చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ దిగింది. తెలుగు కుర్రాడు నితీష్‌ కుమార్‌ రెడ్డి ఆరంభంలోనే ఇంగ్లాండ్‌కు ఊహించని షాకిచ్చాడు. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌లను తక్కువ స్కోర్లకే ఒకే ఓవర్‌లో పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్‌ కేవలం 44 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టా్ల్లో పడింది. కానీ, వాళ్ల సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌ ఇంగ్లాండ్‌ను రక్షించాడు. ఓలీ పోప్‌తో కలిసిన వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లాండ్‌ను కాపాడాడు. ఆ తర్వాత పోప్‌ను జడేజా అవుట్‌ చేయడం, ఆ వెంటనే హ్యారీ బ్రూక్‌ను బుమ్రా బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 172 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

తొలి రోజును పర్వాలేదనే రీతిలో ముగించిన ఇంగ్లాండ్‌.. రెండో 387 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. జో రూట్‌ 104, బ్రైడాన్ కార్స్ 56, జెమీ స్మిత్‌ 51, బెన్‌ స్టోక్స్‌ 44, ఓలీ పోప్‌ 44 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 5, నితీష్‌ కుమార్‌ రెడ్డి 2, సిరాజ్‌ 2, జడేజా ఒక వికెట్‌ పడగొట్టారు. రెండో టెస్టులో 10 వికెట్లు సాధించిన ఆకాశ్‌ దీప్‌కు ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ కూడా దక్కకపోవడం గమనార్హం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..