IND vs ENG : ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి.. అసలు కారణాలు ఇవేనంటూ బాంబు పేల్చిన ఇషాన్
IND vs ENG : ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో ఓటమికి మిడిల్ ఓవర్లలో నెమ్మదైన బ్యాటింగ్, బిష్ణోయ్ వేసిన రెండు నోబాల్స్ కీలక కారణాలని ఇషాన్ కిషన్ వెల్లడించాడు. చిన్న తప్పులే మ్యాచ్‌ను చేజార్చాయని, జట్టు త్వరలోనే బలంగా పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.

IND vs ENG : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 190 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమిపై భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇంగ్లాండ్ వాతావరణం, అక్కడి పిచ్ పరిస్థితులకు భారత జట్టు ఇంకా పూర్తి స్థాయిలో అలవాటు పడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడానికి గల రెండు ప్రధాన కారణాలను ఆయన స్పష్టంగా వివరించారు.
ఇషాన్ కిషన్ చెప్పిన దాని ప్రకారం, మొదటి కారణం మన బ్యాటింగ్ స్ట్రాటజీలో ఉంది. మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లు ఆశించిన స్థాయిలో వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. “ఇంగ్లాండ్ బౌలర్ల దగ్గర మంచి బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. వారికి స్థానిక పరిస్థితులపై మనకంటే ఎక్కువ సమాచారం, అవగాహన ఉంది. వారు మనపై ఎలాంటి వ్యూహాలు ప్రయోగిస్తున్నారో మేము గమనిస్తున్నాము. ఒక టీమ్‌గా మేము ఏ ఏరియాలో వెనుకబడ్డామో తెలుసుకుని, రాబోయే రోజుల్లో మరో 20 పరుగులు అదనంగా ఎలా చేయాలో ఆలోచిస్తాం” అని ఇషాన్ కిషన్ అన్నారు.
మ్యాచ్ చేజారడానికి రెండో ముఖ్య కారణం బౌలింగ్‌లో జరిగిన కొన్ని చిన్న తప్పులు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆ ఓవర్లో రెండు నో బాల్స్ వేయడం వల్ల ఇంగ్లాండ్‌కు ఫ్రీ హిట్స్ లభించాయి. దీనిని పూర్తిగా వాడుకున్న ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ (46 బంతుల్లో 76 నాటౌట్) వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నాడు. “మ్యాచ్ ప్రారంభం నుంచి మన పట్టులోనే ఉంది. కానీ బిష్ణోయ్ వేసిన ఆ రెండు నో బాల్స్ వల్ల వచ్చిన ఫ్రీ హిట్స్ ఇంగ్లాండ్ బ్యాటర్లపై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించాయి. వారు ఆ అవకాశాన్ని చక్కగా వాడుకున్నారు” అని ఇషాన్ పేర్కొన్నారు.
భారత టీ20 జట్టు గత నాలుగు మ్యాచ్‌లుగా ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. ఐర్లాండ్ పర్యటనలో రెండు మ్యాచ్‌లు ఓడిపోగా, ఇంగ్లాండ్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ ఓటమి ఎదురవడంతో జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది. వరుసగా మ్యాచ్‌లు ఓడిపోవడం వల్ల ఆటగాళ్ల మైండ్‌సెట్ మరియు ఆలోచనా విధానంపై ప్రభావం పడుతుందని ఇషాన్ కిషన్ అంగీకరించారు. అయితే జట్టులోని ఆటగాళ్లంతా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం ఉన్నవారేనని, ఈ ఓటమి నుంచి త్వరగానే కోలుకుని బలంగా పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
తమ బౌలర్లు ప్రణాళిక ప్రకారమే బౌలింగ్ చేసినప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ఇషాన్ కిషన్ అన్నారు. క్రీజులో ఎక్కువ సమయం నిలదొక్కుకుని, లభించిన ప్రతి అవకాశాన్ని బెథెల్ పరుగుల రూపంలోకి మార్చుకున్నాడని ప్రశంసించారు. మేము ఓడిపోయినప్పటికీ జట్టుగా మంచి క్రికెట్ ఆడుతున్నామని, కేవలం కొన్ని చిన్న లోపాలను సరిదిద్దుకుంటే రాబోయే మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఇషాన్ కిషన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
