Manoj Tiwary : కోహ్లీని ఫాలో అవుతున్నావ్.. కాస్త దూకుడు తగ్గించు.. గిల్ పై మాజీ క్రికెటర్ ఆగ్రహం

శుభ్‌మన్ గిల్ ప్రదర్శించిన దూకుడుపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ విమర్శలు గుప్పించారు. గిల్ విరాట్ కోహ్లీని అనుకరిస్తున్నాడని, తన ఆవేశాన్ని నియంత్రించుకోవాలని, ఆటపై దృష్టి పెట్టాలని తివారీ సలహా ఇచ్చాడు. మనోజ్ తివారీ వ్యాఖ్యలు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ, వ్యక్తిత్వ వికాసంపై చర్చను లేవనెత్తుతున్నాయి.

Manoj Tiwary : కోహ్లీని ఫాలో అవుతున్నావ్.. కాస్త దూకుడు తగ్గించు.. గిల్ పై మాజీ క్రికెటర్ ఆగ్రహం
Shubman Gill

Updated on: Jul 22, 2025 | 2:28 PM

Manoj Tiwary : ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రదర్శించిన దూకుడుపై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తీవ్ర విమర్శలు చేశారు. మ్యాచ్ మూడో రోజు ఆట చివరిలో ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ జాక్ క్రాలీతో గిల్ మాటల యుద్ధానికి దిగాడు. దీనిపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మనోజ్ తివారీ, గిల్ విరాట్ కోహ్లీని ఫాలో అవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. శుభ్‌మన్ గిల్ విరాట్ కోహ్లీ లాగా అవ్వాలని కోరుకుంటున్నాడని, దాని కోసం అతని పద్ధతులను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడని తివారీ అన్నారు. ఇది పరోక్షంగా శుభమన్ గిల్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో గిల్ ఒక్కసారిగా దూకుడుగా ప్రవర్తించడం కనిపించింది. ఇలాంటి ప్రవర్తన అతని నేచురల్ ఎనర్జీని దూరం చేస్తుందని మనోజ్ తివారీ అన్నారు.

“శుభమన్ గిల్ ప్రవర్తిస్తున్న విధానం నాకు నచ్చలేదు. విరాట్ కోహ్లీ గతంలో చేసిన వాటిని అతను ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. దీని ఫలితంగా అతను బ్యాటింగ్‌లో ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్‌లో కెప్టెన్ అయినప్పటి నుండి అతను దూకుడుగా మారడం కనిపిస్తోంది” అని తివారీ అన్నారు. అంతేకాకుండా, అంపైర్లతో కూడా గిల్ వాగ్వాదానికి దిగుతున్నాడని, ఇవన్నీ గిల్ నిజ స్వభావానికి దూరంగా ఉన్నాయని తివారీ అన్నారు. గతంలో అతను అలాంటి దూకుడును ప్రదర్శించలేదని, ఇప్పుడు దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

“ఒక కెప్టెన్ ప్రతి విషయంలోనూ ముందుండాలి అది నిజమే. కానీ ఇంత దూకుడు అవసరం లేదు. అది వారి ఎనర్జీని లాగేస్తుంది. అతను తన దూకుడు శైలికి కట్టుబడి ఉండవచ్చు, కానీ అది ఎప్పుడూ మాటల్లో ప్రతిబింబించాలని లేదు. టెస్ట్ మ్యాచ్‌లను గెలవడం ద్వారా కూడా దూకుడును చూపించవచ్చు” అని మనోజ్ తివారీ అన్నారు. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి టీమిండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి సులభంగా వెళ్ళి ఉండేది. కానీ భారత బ్యాట్స్‌మెన్‌లు అది చేయలేకపోయారు. ముఖ్యంగా శుభమన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఫెయిల్ అయ్యాడు కాబట్టి, మైదానంలో ఎక్కువగా దూకుడుగా కనిపించడం ఆటగాడికి మంచిది కాదని మనోజ్ తివారీ సలహా ఇచ్చారు.

శుభ్‌మన్ గిల్ మ్యాచ్ మధ్యలో ఉపయోగించిన పదాలపై కూడా తివారీ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టంప్స్ వద్ద ఆడియోలో వినిపించే భాష, పదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. “మీరు భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వహిస్తున్నారు. గత కెప్టెన్లు తమ కోపాన్ని వ్యక్తం చేయడానికి బహుశా ఇలాంటి పదాలను ఉపయోగించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇది ఒక ధోరణిగా మారింది అని నేను భావిస్తున్నాను. ఇలాంటి కోపాలను కంట్రోల్ చేసుకోవాలి. ఈ రకమైన భాషను ఉపయోగిస్తే తదుపరి తరం దాన్ని స్వీకరిస్తుంది. అందుకే మైదానంలో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం గురించి, మాట్లాడే పదాల గురించి శుభ్‌మన్ గిల్ జాగ్రత్తగా ఉండాలి” అని మనోజ్ తివారీ హితవు పలికారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..