IPL Trading : సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. ఎంత తిప్పలు పడినా పప్పులు ఉడకలేదబ్బా

IPL Trading : ఐపీఎల్ 2027 ట్రేడింగ్ విండోలో సీఎస్‌కే ఆటగాళ్ల కోసం ఆర్సీబీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. జేమీ ఓవర్టన్, డెవాల్డ్ బ్రెవిస్‌లను వదులుకునేందుకు చెన్నై నిరాకరించగా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌లపై సీఎస్‌కే దృష్టి సారించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

IPL Trading : సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. ఎంత తిప్పలు పడినా పప్పులు ఉడకలేదబ్బా
Ipl 2027

Updated on: Jul 22, 2026 | 1:15 PM

IPL Trading : గత మూడు సీజన్లుగా వరుసగా తీవ్రంగా నిరాశపరుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, రాబోయే ఐపీఎల్ 2027 సీజన్‌లో సంచలన రీతిలో కమ్ డ్యాక్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకోసం ఇప్పటినుంచే ట్రేడింగ్ మార్కెట్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. వేలానికి ముందే అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి తెచ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ, సీఎస్‌కే జట్ల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ డీల్ కి సంబంధించి ఆసక్తికరమైన చర్చలు జరిగినట్లు వార్తలు బయటకు వచ్చాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) యాజమాన్యం సీఎస్‌కేను సంప్రదించి ఇద్దరు కీలక ఆటగాళ్లను తమకు ఇవ్వాల్సిందిగా కోరింది. గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున అద్భుతంగా రాణించిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ జేమీ ఓవర్టన్‌ను తమకు ఇచ్చి, దానికి బదులుగా జిితేష్ శర్మ, రసిఖ్ సలామ్‌దార్‌లను తీసుకోవాల్సిందిగా ఆర్సీబీ ప్రతిపాదించింది. ఒకవేళ రసిఖ్ వద్దనుకుంటే పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్‌ను కూడా ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే ఈ ప్రతిపాదనను సీఎస్‌కే యాజమాన్యం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ జేమీ ఓవర్టన్‌ను వదులుకునేది లేదని స్పష్టం చేసింది.

జేమీ ఓవర్టన్ డీల్ క్యాన్సిల్ అవ్వడంతో, ఆర్సీబీ మరో యత్నం చేసింది. యంగ్ హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను తమకు ఇస్తే, బదులుగా జితేష్ శర్మతో పాటు స్టార్ ఫాస్ట్ బౌలర్ యాష్ దయాళ్‌ను ఇస్తామని ఆఫర్ చేసింది. ఆర్సీబీ మళ్లీ సంప్రదించడంతో.. “బ్రెవిస్ స్థానంలో మీరు ఏ ప్లేయర్‌ను ఆఫర్ చేసినా సరే, అతడిని వదిలేసే ప్రసక్తి లేనే లేదు” అని సీఎస్‌కే ఘాటుగా సమాధానమిచ్చి చర్చలకు ముగింపు పలికింది. డీల్స్ కుదరకపోవడంతో జితేష్ శర్మను వేరే జట్టుకు ఇచ్చి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లేదా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను దక్కించుకోవాలని ఆర్సీబీ చూస్తోంది.

మరోవైపు సీఎస్‌కే యాజమాన్యం ఇతర జట్ల నుంచి స్టార్ ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను భారీ ధరకు సొంతం చేసుకోవాలని సీఎస్‌కే ప్రయత్నాలు చేస్తోంది. అయితే, హార్దిక్‌ను ఇచ్చి బదులుగా యువ ఆటగాడిని తీసుకోవాలని ముంబై భావిస్తోంది. కానీ హార్దిక్ వయసు ప్రస్తుతం 32 ఏళ్లు కావడంతో పాటు తరచూ గాయాల బారిన పడుతున్నందున, అతని కోసం తమ యంగ్ ప్లేయర్లను వదులుకోవద్దని సీఎస్‌కేలో కొందరు సభ్యులు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో ఈ చర్చలు కొలిక్కి రాకుండా నిలిచిపోయాయి.

ముంబైతో పాటు గుజరాత్ టైటాన్స్ జట్టులోని తమిళనాడు ప్లేయర్లు అయిన వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్‌లను ట్రేడ్ చేసుకోవడానికి సీఎస్‌కే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వీరికి ప్రత్యామ్నాయంగా ఉర్విల్ పటేల్‌ను ఇచ్చేందుకు సీఎస్‌కే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు, రాబోయే సీజన్ కోసం జట్టుకు కొత్త హెడ్ కోచ్‌ను నియమించే పనిలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ నిర్వాహకులు వేగంగా అడుగులు వేస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us