IPL Player Records : ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ మావే..అన్ని జెర్సీలు వేసేసిన అరుదైన ఆటగాళ్లు వీళ్లే

IPL Player Records : ఐపీఎల్‌లో జట్లు మారుతూ రికార్డు సృష్టించిన ఆటగాళ్లు వీరే. ఆరోన్ ఫించ్ గరిష్టంగా 9 జట్ల తరపున ఆడగా, ఉనద్కత్ 8, మనీష్ పాండే 7 జట్లకు ప్రాతినిధ్యం వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు.కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపు డజనుకు దగ్గరగా జట్లు మారిన ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఉన్నారు.

IPL Player Records : ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ మావే..అన్ని జెర్సీలు వేసేసిన అరుదైన ఆటగాళ్లు వీళ్లే
Ipl Player Records

Updated on: Mar 19, 2026 | 8:49 AM

IPL Player Records : ఐపీఎల్ అంటేనే రంగుల ప్రపంచం. ప్రతి సీజన్‌లోనూ జట్లు మారుతుంటాయి, ఆటగాళ్ల జెర్సీలు మారుతుంటాయి. అయితే కొంతమంది ఆటగాళ్లకు మాత్రం ఐపీఎల్‌లో ఒక విచిత్రమైన రికార్డు ఉంది. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి దాదాపు డజనుకు దగ్గరగా జట్లు మారిన ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఉన్నారు. ఒక జట్టు నుంచి మరో జట్టుకు మారుతూ, లీగ్‌లో ఉన్న దాదాపు అన్ని ఫ్రాంచైజీల తరపున ఆడిన ఆ గెస్ట్ అప్పీరెన్స్ స్టార్ల వివరాలు తెలుసుకుందాం.

ఆరోన్ ఫించ్

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక జట్ల తరపున ఆడిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ రికార్డు సృష్టించాడు. ఆయన ఏకంగా 9 వేర్వేరు ఫ్రాంచైజీల తరపున బరిలోకి దిగాడు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, పుణే వారియర్స్ ఇండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్.. ఇలా ఒకటేమిటి దాదాపు లీగ్‌లో ఉన్న అన్ని మేజర్ టీమ్స్ జెర్సీలను ఫించ్ ధరించాడు. ఒక ఆటగాడు ఇన్ని జట్లు మారడం అనేది ఐపీఎల్ హిస్టరీలోనే ఒక అరుదైన విషయం.

జయదేవ్ ఉనద్కత్

భారత ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కూడా ఈ జాబితాలో ఎవరికీ తీసిపోలేదు. ఇప్పటివరకు ఆయన 8 వేర్వేరు జట్ల తరపున ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల కోసం ఆయన బౌలింగ్ చేశాడు. వేలంలో భారీ ధర పలకడం లేదా జట్టు నుంచి తప్పుకోవడం ఉనద్కత్ కెరీర్‌లో సర్వసాధారణం అయిపోయింది. టీమ్ ఏదైనా సరే తనదైన శైలిలో బౌలింగ్ వేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.

మనీష్ పాండే, దినేష్ కార్తీక్

ఐపీఎల్‌లో సెంచరీ బాదిన తొలి భారతీయుడు మనీష్ పాండే కూడా ఈ ట్రావెలర్ల లిస్టులో ఉన్నాడు. ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, పుణే వారియర్స్, కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్, లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ ఇలా మొత్తం 7 జట్ల తరపున ఆయన ఆడాడు. ఇక ఫినిషర్ దినేష్ కార్తీక్ ప్రయాణం కూడా తక్కువేమీ కాదు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, గుజరాత్ లయన్స్, కేకేఆర్ జట్ల కోసం కార్తీక్ తన సేవలందించాడు. వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషించిన కార్తీక్, ఆయా జట్లకు ఎంతో భరోసానిచ్చాడు.

యువరాజ్ సింగ్

టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ కూడా తన ఐపీఎల్ కెరీర్‌లో 6 వేర్వేరు జెర్సీలలో కనిపించాడు. పంజాబ్ కింగ్స్, పుణే వారియర్స్, ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆయన తన ఆల్ రౌండ్ టాలెంట్ చాటుకున్నాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో టైటిల్ గెలిచినప్పుడు యువీ ఆ జట్టులో కీలక సభ్యుడు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కూడా ఆయన రికార్డు సృష్టించారు. జట్లు ఎన్ని మారినా యువీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us