
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ.. తెరవెనుక వివాదాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియా సమావేశంలో ఉపయోగించిన హనీ-ట్రాప్ అనే పదం క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారానికి కారణమైంది. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. కొందరు ఆకతాయిలు ఏకంగా ఐపీఎల్ క్రికెటర్ల భార్యలు, పార్ట్‌నర్లను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్, వేధింపులకు దిగడంతో గందరగోళ వాతావరణం నెలకొంది.
ఈ వివాదంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తాజాగా స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎలాంటి హనీ-ట్రాపింగ్ ఉదంతాలు తమ దృష్టికి రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ అనేది అత్యంత పారదర్శకంగా, స్వచ్ఛంగా సాగుతున్న టోర్నమెంట్ అని, ఇలాంటి లేనిపోని పుకార్లను నమ్మవద్దని ఆయన అభిమానులను కోరారు.
అయితే ఈ సీజన్లో ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, ఫ్రాంచైజీల మేనేజ్‌మెంట్ వైపు నుంచి కొన్ని క్రమశిక్షణా ఉల్లంఘనలు, ప్రోటోకాల్ వివాదాలు జరిగిన మాట నిజమేనని బీసీసీఐ అంగీకరించింది. ఇలాంటి సంఘటనలను ముందే అరికట్టకపోతే టోర్నమెంట్‌తో పాటు బోర్డు ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా 10 ఐపీఎల్ ఫ్రాంచైజీల సీఈఓలకు ఒక సుదీర్ఘమైన హెచ్చరిక లేఖ రాశారు. ఆటగాళ్ల భద్రత, లీగల్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని అపరిచిత వ్యక్తులను హోటల్ గదుల్లోకి రానివ్వకూడదని, యాంటీ కరప్షన్ ప్రోటోకాల్స్ కచ్చితంగా పాటించాలని అందులో ఆదేశించారు.
లీగ్ సాఫీగా సాగుతోందని చెబుతూనే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ లేదా వేపింగ్ చేసిన ఉదంతాన్ని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రస్తావించారు. టీవీ లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో రియాన్ పరాగ్ వేప్ పట్టుకుని కనిపించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇలాంటి చిన్నపాటి సంఘటనలను మనం ముందే నివారించాల్సి ఉండాల్సిందని, ఆ ఒక్క వివాదం మినహా ఈ సీజన్లో ఎలాంటి పెద్ద తప్పులు జరగలేదని ఆయన అన్నారు. సెక్రటరీ దేవజిత్ సైకియా చేసిన నిర్దిష్ట వ్యాఖ్యల గురించి తనకు పూర్తి సమాచారం లేదని, దానిపై ఆయనే మాట్లాడాలని ధుమాల్ పేర్కొన్నారు.
వివాదాలను పక్కనబెడితే, ఆట పరంగా ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత అద్భుతంగా సాగిందని ఐపీఎల్ చైర్మన్ కొనియాడారు. మునుపటి సీజన్ల లాగే, ఈసారి కూడా లీగ్ స్టేజ్ చివరి రోజు వరకు ఏ ఏ నాలుగు జట్లు ప్లే-ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతాయో ఎవరికీ అర్థం కాలేదని, అదే ఐపీఎల్ కి ఉన్న అసలైన బ్యూటీ అని ఆయన అన్నారు. మ్యాచ్‌ల క్వాలిటీ, ఆటగాళ్ల ప్రదర్శన ఈసారి నెక్ట్స్ లెవెల్‌లో ఉందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..