సౌదీ అరేబియాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరిగే ఐపీఎల్ 2025 మెగా వేలం ఈసారి రెండు సెట్ల మార్క్యూ ప్లేయర్లతో మరింత ఆసక్తికరంగా మారింది. వరుసగా రెండో సంవత్సరం కూడా ఈ వేలం విదేశాలలో జరగనుంది. ఈసారి వేలం కోసం మొత్తం 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా, అందులో 1165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులు ఉన్నారు. ఈ జాబితా IPL బోర్డు, ఫ్రాంచైజీల చర్చల తర్వాత కుదించబడుతుంది.
ప్రాంచైజీలు కొందరు తమ అత్యంత కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేయగా, ఇతర జట్లు తక్కువ సంఖ్యలో ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురిని, ఢిల్లీ క్యాపిటల్స్ నలుగురిని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముగ్గురిని, పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరిని మాత్రమే రిటైన్ చేశాయి.
ఈసారి వేలంలో రెండు సెట్ల మార్క్యూ ప్లేయర్లను నియమాన్ని తీసుకురాబోంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం, ఈ సెట్లలో రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, ఆర్ అశ్విన్, మిచెల్ స్టార్క్, జోస్ బట్లర్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉంటారు. మార్క్యూ ప్లేయర్ల బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు. మొదటి రెండు సెట్ల ముగిసే నాటికి ఫ్రాంచైజీలు తమ మొత్తం బడ్జెట్‌లో 30-50% వరకు ఖర్చు చేస్తాయని అంచనా.
2014, 2018 సంవత్సరాల్లో ఉన్న పాత నియమాన్ని తిరిగి తీసుకురావడంతో ఈసారి వేలం మరింత ఆశక్తికరంగా మారనుంది. ఈ మెగా ఈవెంట్ ద్వారా ఐపీఎల్ మరింత వినూత్నంగా మారుతుందని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.