
IPL 2026 LSG : ఐపీఎల్ 2026 సీజన్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు ఒక పీడకలలా మారుతోంది. ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి, పాయింట్ల పట్టికలో అట్టడుగున (10వ స్థానం) నిలిచింది. జట్టు ప్రదర్శనతో పాటు కెప్టెన్ రిషభ్ పంత్ ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వసీం జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ లక్నో జట్టు పరిస్థితిపై ఘాటుగా స్పందించారు. “రిషభ్ పంత్‌పై కెప్టెన్సీ భారం ఎక్కువగా ఉంది. దీనివల్ల అతను బ్యాటర్‌గా రాణించలేకపోతున్నాడు. అతన్ని కేవలం ఒక ప్లేయర్‌గా మాత్రమే ఆడేందుకు స్వేచ్ఛనివ్వాలి. అతనికి పూర్తి స్వేచ్ఛనిస్తేనే మ్యాచ్‌లు గెలిపించగలుగుతాడు. నా దృష్టిలో ఎయిడెన్ మార్‌క్రమ్ లక్నోకు సరైన కెప్టెన్. అతను మానసికంగా చాలా ధృడంగా ఉంటాడు, సౌతాఫ్రికా జట్టును అద్భుతంగా నడిపించిన అనుభవం అతనికి ఉంది. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలో మార్‌క్రమ్‌కు బాగా తెలుసు” అని జాఫర్ అభిప్రాయపడ్డారు.
ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఆడిన 8 మ్యాచ్‌లలో ఏకంగా 6 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. కేవలం 4 పాయింట్లు, -1.106 నెట్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. లక్నో జట్టు ఇప్పుడు ఆటలో ఎక్కడా ఐక్యత ఉన్నట్లు కనిపించడం లేదని, మైదానంలో ఆటగాళ్లు పూర్తిగా చెల్లాచెదురై పోతున్నారని జాఫర్ విమర్శించారు. ఒకవేళ తను గనుక డగౌట్‌లో ఉంటే, మొదటి పనిగా మార్‌క్రమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో లక్నో ప్లేఆఫ్స్ చేరుకోవడం దాదాపు అసాధ్యం. జట్టు ఇంకా 6 లీగ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకవేళ అద్భుతం జరిగి ఆ 6 మ్యాచ్‌లలో గెలిచినా జట్టుకు 16 పాయింట్లు మాత్రమే వస్తాయి. కానీ, దారుణమైన నెట్ రన్ రేట్ వల్ల 16 పాయింట్లు వచ్చినా టాప్-4 లో చోటు దక్కించుకోవడం చాలా కష్టం. బ్యాటింగ్‌లో పంత్ ఫామ్ కోల్పోవడం, బౌలింగ్‌లో పస లేకపోవడం జట్టును పీడిస్తున్నాయి. ఒకవేళ యాజమాన్యం జాఫర్ సలహాను పాటిస్తే, సీజన్ చివరి దశలోనైనా లక్నో గెలుపు బాట పడుతుందేమో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..