IPL 2026 : ఐపీఎల్‌లో ఘోరంగా ముంచేసిన రోహిత్, పాండ్యా, పంత్.. సోషల్ మీడియాలో స్కామ్ టీమ్ కలకలం

IPL 2026 : ఫ్రాంచైజీల నమ్మకాన్ని, వందల కోట్ల రూపాయల డబ్బును బూడిదలో పోసిన పన్నీరు చేసిన ఆటగాళ్లతో కూడిన ఒక స్కామ్ ప్లేయింగ్ ఎలెవన్ లిస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫ్లాప్ లిస్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లతో పాటు ఐపీఎల్ లెజెండ్ ఎమ్మెస్ ధోని పేరు కూడా ఉండటం క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.

IPL 2026 : ఐపీఎల్‌లో ఘోరంగా ముంచేసిన రోహిత్, పాండ్యా, పంత్.. సోషల్ మీడియాలో స్కామ్ టీమ్ కలకలం
Ipl 2026

Updated on: May 29, 2026 | 10:08 AM

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత కొందరు మల్టీ క్రోర్ ఇంటర్నేషనల్ సూపర్ స్టార్లు తీవ్ర ప్రజా విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈ లీగ్‌లో తక్కువ ధరకు అమ్ముడైన అన్‌క్యాప్డ్ ప్లేయర్లు తమ అద్భుత ప్రదర్శనతో అదరగొడితే.. ఫ్రాంచైజీల నుంచి భారీగా జీతాలు తీసుకుని రిటైన్ అయిన కొందరు సీనియర్ స్టార్ ప్లేయర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. ఫ్రాంచైజీల నమ్మకాన్ని, వందల కోట్ల రూపాయల డబ్బును బూడిదలో పోసిన పన్నీరు చేసిన ఆటగాళ్లతో కూడిన ఒక స్కామ్ ప్లేయింగ్ ఎలెవన్ లిస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫ్లాప్ లిస్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లతో పాటు ఐపీఎల్ లెజెండ్ ఎమ్మెస్ ధోని పేరు కూడా ఉండటం క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.

ఈ వివాదాస్పద వైరల్ లైన్-అప్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేరు ప్రముఖంగా కనిపిస్తోంది. సిఎస్‌కే యాజమాన్యం రూ.18 కోట్ల భారీ ధరతో ఇతడిని రిటైన్ చేసుకోగా, ఈ సీజన్‌లోని 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం 28 సగటుతో 337 పరుగులు మాత్రమే చేసి అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మకు కూడా ఈ టోర్నమెంట్ ఒక పీడకలలా మిగిలింది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా లీగ్ ప్రారంభంలో కొన్ని కీలక మ్యాచ్‌లకు దూరమైన రోహిత్, ఆ తర్వాత జట్టులోకి వచ్చినా ఫామ్ అందుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. రూ.16.30 కోట్ల భారీ ధర కలిగిన హిట్ మ్యాన్.. తాను ఆడిన 9 మ్యాచ్‌లలో కేవలం 283 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఈ ఏడాది ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ జట్టు అందరికంటే దిగువన నిలవడానికి ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రధాన కారణమయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. రూ.16.30 కోట్ల సాలరీ తీసుకుంటున్న ఈ టీ20 స్పెషలిస్ట్, ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాల ముందు తేలిపోతూ కేవలం 20.77 సగటుతో 270 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు) సైతం తన చెత్త కెప్టెన్సీ, పేలవమైన ఆటతీరుతో తీవ్ర విమర్శలపాలయ్యాడు. గత రెండు పూర్తి సీజన్లు కలిపినా అతను బ్యాట్‌తో కేవలం 430 పరుగులు మాత్రమే చేయగలిగాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ధర రూ.27 కోట్లు పలికిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా ఈ స్కామ్ ఎలెవన్ లిస్టులో టాప్‌లో ఉన్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమైన పంత్ 14 మ్యాచ్‌లలో కేవలం 312 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ భారీ హిట్టర్ నికోలస్ పూరన్ రూ. 21 కోట్ల భారీ ప్యాకేజీ తీసుకుని, టోర్నమెంట్ అంతటా కేవలం 18 సగటుతో పరుగుల కొరతతో అల్లాడిపోయాడు.

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిడిలార్డర్ బ్యాటర్ జితేష్ శర్మ ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఒక పెద్ద మైనస్‌గా మారాడు. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకుండా కేవలం 105 పరుగులు మాత్రమే చేసి ప్రైస్ ఫ్లాప్‌గా మిగిలాడు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం టోర్నీలో పెద్దగా బౌలింగ్ చేయకపోగా, బ్యాటింగ్‌లోనూ ఎలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడకుండా 311 పరుగులకే పరిమితమయ్యాడు.

బ్యాటింగ్‌తో పాటు భారీ ధరలు పలికిన వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా ఈసారి ఘోరంగా చేతులెత్తేశారు. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అటాక్‌ను నడిపించిన అర్ష్‌దీప్ సింగ్ (రూ.18 కోట్లు) విపరీతంగా పరుగులు సమర్పించుకుంటూ 14 మ్యాచ్‌ల్లో కేవలం 14 వికెట్లు మాత్రమే తీసి చాలా ఎక్స్‌పెన్సివ్‌గా మారాడు. ముంబై ఇండియన్స్ నమ్మకమైన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తన ఐపీఎల్ కెరీర్ 10 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక ఎకానమీ రేట్‌ను నమోదు చేసి ఫ్రాంచైజీని ముంచేశాడు. 14 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా కేవలం 4 వికెట్లు మాత్రమే తీయడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. రాజస్థాన్ రాయల్స్ స్వింగ్ కింగ్ ట్రెంట్ బౌల్ట్ సైతం ఈ సీజన్‌లో తన పవర్‌ప్లే స్వింగ్‌ను పూర్తిగా కోల్పోయాడు. కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బౌల్ట్, కేవలం 2 వికెట్లు తీసి ఘోరమైన ప్రదర్శన ఇచ్చాడు.

ఈ వైరల్ లిస్టులో అందరినీ ఆశ్చర్యపరిచిన పేరు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, లెజెండ్ ఎమ్మెస్ ధోనిది. ఈ సీజన్ మొత్తం ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే త్వరలోనే జట్టులోకి రీ-ఎంట్రీ ఇస్తానంటూ నిరంతరం హింట్లు ఇస్తూ సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడం మినహా, ప్రాక్టికల్‌గా జట్టుకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అందుకే అతనికి కూడా ఈ ప్రైస్ ఫ్లాప్ స్కామ్ ప్లేయింగ్ ఎలెవన్‎లో చోటు కల్పించడం విశేషం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us