రాజస్థాన్ గెలవాల్సిన మ్యచ్‌ రా భయ్.. ఆ హైడ్రామాతో మారిన సీన్.. ఒక్క క్షణంలో రిజల్ట్ ఛేంజ్

టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీం 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టీం కేవలం 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. దీంతో ఆదివారం బెంగళూరుతో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది.

రాజస్థాన్ గెలవాల్సిన మ్యచ్‌ రా భయ్.. ఆ హైడ్రామాతో మారిన సీన్.. ఒక్క క్షణంలో రిజల్ట్ ఛేంజ్
Gt Vs Rr Toss Issue

Updated on: May 30, 2026 | 1:19 PM

ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న వేళ, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్-2 పోరులో గుజరాత్ టీం ఘన విజయం సాధించింది. అయితే, అంతకుముందు టాస్ సమయంలో ఊహించని డ్రామా చోటుచేసుకుంది. టాస్ సమయంలో మ్యాచ్ రెఫరీ చేసిన ఒక చిన్న పొరపాటు కారణంగా గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

టాస్ వేళ గందరగోళం.. అసలేం జరిగిందంటే?

న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఫైనల్ బెర్తు కోసం హోరాహోరీ పోరు మొదలైంది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందే టాస్ వేదికగా హైడ్రామా నడిచింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాణేన్ని పైకి ఎగరేయగా, రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ గట్టిగా తన కాల్ (హెడ్స్ లేదా టైల్స్) చెప్పాడు. కానీ అక్కడ ఉన్న మైదాన కోలాహలంలో మ్యాచ్ రెఫరీ ఆ కాల్‌ను సరిగ్గా వినలేకపోయాడు.

తొలిసారి నాణెం పడినప్పుడు అది గుజరాత్ టైటాన్స్‌కు అనుకూలంగా వచ్చింది. కానీ రెఫరీ తాను పరాగ్ కాల్‌ను వినలేదని చెప్పడంతో, టాస్‌ను మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. రెండోసారి టాస్ వేసినప్పుడు అదృష్టం రాజస్థాన్‌ను వరించింది. పరాగ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటిసారి టాస్ తమకే దక్కినా, రెఫరీ అంతర్గత గందరగోళం వల్ల మళ్లీ టాస్ వేయాల్సి రావడం, అందులో తాము ఓడిపోవడంతో శుభ్‌మన్ గిల్ ముఖంలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం స్పష్టంగా కనిపించాయి.

పిచ్ లీలలు.. కెప్టెన్ల వ్యూహాలు ఇవే!

టాస్ గెలిచిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ, తాము మొదట బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపాడు. పిచ్ ఆరంభంలో అద్భుతంగా ఉన్నప్పటికీ, మ్యాచ్ సాగుతున్న కొద్దీ నెమ్మదించే అవకాశం ఉందని, తమ వద్ద ఉన్న బౌలింగ్ వనరులతో ఆ లక్ష్యాన్ని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ కీలక మ్యాచ్ కోసం తమ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశాడు.

మరోవైపు తీవ్ర నిరాశకు గురైన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ, తాము కూడా మొదట బ్యాటింగే చేయాలనుకున్నామని చెప్పాడు. ఈ పిచ్‌పై ఇప్పటికే ఆట సాగినందున దీని స్వభావం పెద్దగా మారకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. తమకు ఇది ‘డూ ఆర్ డై’ లాంటి పరిస్థితి అని, ఫైనల్ చేరడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.

మారిన పరిస్థితి..

కానీ, మ్యాచ్ పూర్తయ్యాక మాత్రం కెప్టెన్ గిల్ సంతోషంలో మునిగిపోయాడు. ఎందుకంటే, ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే, గుజరాత్ ఓటమిపాలయ్యేదేమో అంటూ చెప్పుకొచ్చాడు. పిచ్ ఇలా మారడంతో టాస్ ఓడిపోవడం మంచిదేనంటూ చెప్పుకొచ్చాడు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీం 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టీం కేవలం 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. దీంతో ఆదివారం బెంగళూరుతో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్ ఆడేందుకు సిద్ధమైంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us