
Rajasthan Royals : ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు ఒక భారీ షాకింగ్ అప్‌డేట్ అందింది. గత కొన్ని ఏళ్లుగా జట్టును నడిపించిన సంజూ శాంసన్ జట్టును వీడటంతో, రాయల్స్ ఫ్రాంచైజీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 24 ఏళ్ల వయసున్న యువ ఆటగాడిని కెప్టెన్‌గా నియమిస్తూ కొత్త శకానికి నాంది పలికింది. ఇంటర్వ్యూలు, గత సీజన్ ప్రదర్శనల ఆధారంగా మేనేజ్‌మెంట్ ఈ తుది నిర్ణయానికి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో గత కొద్దిరోజులుగా జరుగుతున్న మార్పులు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. ఆ జట్టు స్టార్ కెప్టెన్ సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ ద్వారా వెళ్లడం దాదాపు ఖాయమైంది. గత సీజన్‌లో సంజూ గాయపడటంతో జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో సంజూ స్వయంగా జట్టు మార్పు కోరుకోగా, మేనేజ్‌మెంట్ కూడా అంగీకరించింది. ఈ క్రమంలో ఖాళీ అయిన కెప్టెన్సీ స్థానం కోసం పలువురు సీనియర్ల పేర్లు వినిపించినా, చివరికి రియాన్ పరాగ్ నే వరించింది.
ఈ నియామకానికి ముందు హెడ్ కోచ్ కుమార్ సంగక్కర జట్టులోని కీలక ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, 2019 నుంచి జట్టుతో ఉన్న రియాన్ పరాగ్‌కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. గత సీజన్‌లో సంజూ శాంసన్ అందుబాటులో లేని 8 మ్యాచ్‌లకు పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో జట్టును నడిపించిన తీరు, క్లిష్ట పరిస్థితుల్లో కోల్‌కతాపై చేసిన 95 పరుగుల ఇన్నింగ్స్ మేనేజ్‌మెంట్‌ను మెప్పించాయి. కుర్రాడైనా అనుభవం ఉన్న ఆటగాడిగా పరాగ్ ఈ పరీక్షలో పాసయ్యారు.
రియాన్ పరాగ్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 84 మ్యాచ్‌లు ఆడి 1566 పరుగులు చేశారు. 2024 సీజన్‌లో 573 పరుగులతో (సగటు 52.09) సత్తా చాటారు. గత సీజన్‌లో కూడా 166.52 స్ట్రైక్ రేట్‌తో 393 పరుగులు చేసి తన దూకుడును నిరూపించుకున్నారు. బౌలింగ్‌లోనూ 7 వికెట్లు పడగొట్టి ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్నారు. రాహుల్ ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత ఇప్పుడు సంగక్కర కోచింగ్‌లో, పరాగ్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ రెండో ఐపీఎల్ టైటిల్ కోసం వేట మొదలుపెట్టనుంది.
2008లో షేన్ వార్న్ సారథ్యంలో మొదటి టైటిల్ గెలిచిన రాజస్థాన్, ఆ తర్వాత మళ్ళీ కప్ అందుకోలేదు. ఇప్పుడు ఒక యువ ఆటగాడికి పగ్గాలు అప్పగించడం ద్వారా జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. మరి ఈ 24 ఏళ్ల కుర్ర కెప్టెన్ రాజస్థాన్ రాయల్స్ కిరీటాన్ని తెచ్చిపెడతాడో లేదో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..