
IPL 2026 Points Table: ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల మోత మోగుతుంటే.. పాయింట్ల పట్టికలో మాత్రం నంబర్-1 స్థానం కోసం జట్ల మధ్య గట్టి పోరు నడుస్తోంది. ఆదివారం జరిగిన హై-వోల్టేజ్ డబుల్ హెడర్ మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన విశ్వరూపం చూపిస్తూ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బ్లాక్ బస్టర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 43 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ, పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ కేవలం 24 గంటల ముందే మొదటి స్థానాన్ని ఆక్రమించగా, బెంగళూరు దాన్ని మళ్లీ లాగేసుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి 4 పాయింట్లతో ఉంది. అయితే మెరుగైన నెట్ రన్‌రేట్ (+2.507) కారణంగా రాజస్థాన్ రాయల్స్ (+2.233) కంటే ముందు వరుసలో నిలిచింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రజత్ పాటిదార్ సేన ప్రస్తుతానికి టేబుల్ టాపర్‌గా నిలిచింది.
ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడ్డాయి. ఈ పోరులో లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచి ఈ సీజన్‌లో తన మొదటి పాయింట్లను సాధించింది. రెండు మ్యాచ్‌లు ఆడిన లక్నోకి ఇది తొలి విజయం. మరోవైపు హైదరాబాద్ ఈ సీజన్‌లో మూడో మ్యాచ్ ఆడి రెండో ఓటమిని చవిచూసింది. పాయింట్ల పట్టికలో ఎస్ఆర్‌హెచ్ (+0.275) ఐదో స్థానంలో ఉండగా, లక్నో ఎనిమిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. నెట్ రన్‌రేట్ పరంగా ఎస్ఆర్‌హెచ్ మెరుగ్గా ఉన్నా, వరుస ఓటములు ఆ జట్టును కలవరపెడుతున్నాయి.
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఖాతా తెరవని మూడు జట్లలో చెన్నై కూడా ఒకటి. గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఇంకా బోణీ కొట్టలేదు కానీ, అవి రెండేసి మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. చెన్నై మాత్రం మూడు మ్యాచ్‌లు ఆడి మూడు ఓడిపోవడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలపై అప్పుడే నీలి నీడలు కమ్ముకున్నాయి. నెట్ రన్‌రేట్ పరంగా కూడా చెన్నై మిగిలిన జట్ల కంటే వెనుకబడి ఉంది.
ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ ఆరో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో జట్ల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉందంటే.. ఒకే ఒక్క గెలుపు లేదా ఓటమితో జట్లు ఐదు, ఆరు స్థానాలు కిందకి పడిపోవడం లేదా పైకి వెళ్లడం జరుగుతోంది. రాబోయే మ్యాచ్‌ల్లో గుజరాత్, కోల్‌కతా జట్లు గెలిస్తే పట్టికలో మరిన్ని సంచలన మార్పులు చోటుచేసుకోవడం ఖాయం.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి