IPL 2026 : నేటితో లీగ్ స్టేజ్ హాఫ్ సీజన్ క్లోజ్.. పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఎక్కడ ఉందంటే?

IPL 2026 : ఈ సీజన్ తొలి అర్ధభాగంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై, లక్నో జట్లు ఇప్పటివరకు కేవలం రెండేసి విజయాలు మాత్రమే నమోదు చేశాయి.

IPL 2026 : నేటితో లీగ్ స్టేజ్ హాఫ్ సీజన్ క్లోజ్.. పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఎక్కడ ఉందంటే?
Ipl 2026 Points Table

Updated on: Apr 25, 2026 | 12:34 PM

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. నేటితో ఈ టోర్నీలో సగం లీగ్ మ్యాచ్‌లు పూర్తవుతాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే 35వ మ్యాచ్‌తో ఈ సీజన్ తొలి అర్ధభాగం ముగుస్తుంది. ఇప్పటివరకు జరిగిన ఆటను బట్టి చూస్తే కొన్ని జట్లు ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతుండగా, మరికొన్ని జట్లు గెలవలేక పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 11 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే ఏడో మ్యాచ్‌లో ఒకవేళ పంజాబ్ ఓడిపోయినప్పటికీ, ఆ జట్టు నంబర్ వన్ స్థానానికేం ఢోకా లేదు. నెట్ రన్ రేట్, పాయింట్ల పరంగా ఆ జట్టు చాలా పటిష్టంగా ఉంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ గెలిస్తే ఆ జట్టు ఐదో స్థానానికి చేరొచ్చు కానీ, టాప్ 4లోకి రావడం కష్టమే.

ఈ సీజన్ తొలి అర్ధభాగంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ముంబై ఇండియన్స్ (MI), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై, లక్నో జట్లు ఇప్పటివరకు కేవలం రెండేసి విజయాలు మాత్రమే నమోదు చేశాయి. ఇక కేకేఆర్ పరిస్థితి ఇంకా ఘోరం.. ఆ జట్టు కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. ఈ మూడు జట్లు ప్లేఆఫ్స్ చేరాలంటే రెండో అర్ధభాగంలో ఆడే ప్రతి మ్యాచ్‌ను భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీరి ఆటతీరు చూస్తుంటే టైటిల్ రేసులో ఉన్నట్లు అనిపించడం లేదు.

సీజన్ మధ్యలో పాయింట్ల పట్టికను గమనిస్తే.. పంజాబ్ కింగ్స్ (11 పాయింట్లు) మొదటి స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదు విజయాలతో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ కూడా ఐదు విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) 7 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీకి నేడు గెలిస్తే 8 పాయింట్లు వస్తాయి కానీ రన్ రేట్ కారణంగా ఐదో స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుంది.

ప్రతి జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. సగం ప్రయాణం పూర్తవడంతో మిగిలిన 7 మ్యాచ్‌లు ప్రతి జట్టుకు చావోరేవో లాంటివే. ముఖ్యంగా పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న ముంబై, లక్నో జట్లు ఇకనుంచి గెలుపు బాట పట్టకపోతే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. పంజాబ్, బెంగళూరు, రాజస్థాన్ జట్లు ప్లేఆఫ్స్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకునే దిశగా ఉన్నాయి. నాలుగో స్థానం కోసం హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us