
ఆర్సీబీ ఫ్యాన్స్17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త చరిత్ర సృష్టించింది. పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. రెండు జట్లు 18 ఏళ్లుగా కప్పు కోసం ఎదురుచూడగా.. చివరికి ట్రోఫీ బెంగళూరును వరించింది. అయితే పంజాబ్ కూడా ఏమాత్రం తీసిపోలేదు. చివరి వరకు పోరాడింది. కేవలం ఆరు పరుగుల తేడాతోనే చేజార్చుకుంది. ఇదిలా ఉంటే.. పంజాబ్ ఓటమికి కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
పంజాబ్ జట్టు ఓపెనర్లు ఇన్నింగ్స్ మొదట్లో నెమ్మదిగా ఆటను ఆడటంతో పాటు.. నేహల్ వధేరా కూడా స్లోగా ఆడాడని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. అలాగే అసలైన మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక్క పరుగుకే అవుట్ కావడం కూడా పంజాబ్ జట్టుకు భారీ దెబ్బ తగిలిందన్నారు. అటు టార్గెట్ చేధించడంలో పంజాబ్ బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేకపోవడం.. అలాగే ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యా అద్భుత బౌలింగ్(4-0-17-2) మ్యాచ్ పంజాబ్ చేతుల్లో నుంచి చేజారేలా చేసిందన్నారు. మరీ ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ వేసిన 17వ ఓవర్ మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పేసింది. ఆ ఒక్క ఓవర్‌లో మొదటి బంతికి నేహల్ వధేరాను, మూడో బంతికి మార్కస్ స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపాడు భువనేశ్వర్. దీంతోనే అటు ఆర్సీబీకి కప్పు.. ఇటు పంజాబ్‌కు ఓటమి ఖరారయ్యాయి.
మరోవైపు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లలో మంచి పరుగులు రావడంతో 190 పరులుగు చేసింది. ఇక ఈ టోర్నీలో అదరగొడుతూ వచ్చిన పంజాబ్ కింగ్స్..ఫైనల్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర్లో శశాంక్ సింగ్ 30 బాల్స్‌లో 61 పరుగులు చేసి పోరాడినా.. పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. 6 పరుగుల తేడాతో మ్యాచ్ ఆర్‌సీబీ సొంతమైంది. నాలుగోసారి ఫైనల్ చేరిన ఆర్సీబీ మొదటిసారి టైటిల్ గెలవగా.. రెండోసారి ఫైనల్ వరకు వచ్చిన పంజాబ్ కింగ్స్.. మరోసారి ఐపీఎల్ ట్రోఫీకి అడుగుదూరంలో ఆగిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..