ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తరఫున కెప్టెన్ డేవిడ్ వార్నర్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అక్షర్ పటేల్ కూడా 36 పరుగులతో తన వంతు పాత్ర పోషించాడు. తదనంతరం క్రీజులోకి వచ్చిన గుజరాత్ టీమ్ తన ఎదుట ఉన్న 163 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించేసింది. అయితే బౌలింగ్ సమయంలో వార్నర్ తీసుకున్న తప్పుడు నిర్ణయమే మ్యాచ్ ఓడిపోవడానికి కారణమని ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. అవును, అటు నెటిజన్లే కాక ఇటు ఇతర జట్ల అభిమానులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ బ్యాటింగ్ సమయంలో అక్షర్ పటేల్‌కు బౌలింగ్ చేసే అవకాశం కెప్టెన్ వార్నర్ ఇవ్వకపోవడమే మ్యాచ్ ఓటమికి కారణమని క్రికెట్ అభిమానులు అంటున్నారు. అక్షర్ విషయంలో వార్నర్ తీసుకున్న నిర్ణయమే ఢిల్లీ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోవడానికి కారణమని అంతా భావిస్తున్నారు.
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీ కెప్టెన్ వార్నర్ మాట్లాడుతూ అక్షర్ పటేల్‌కు బౌలింగ్ అవకాశం ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు. దీనిపై డేవిడ్ వార్నర్‌ను ప్రశ్నించగా ‘వికెట్, మ్యాచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అక్షర్ పటేల్‌కు బౌలింగ్ అవకాశం ఇవ్వకూడదని తాను నిర్ణయం తీసుకున్నాను. అతని కంటే కుల్‌దీప్, మిచెల్ మార్ష్ ఎఫెక్టివ్‌గా రాణిస్తారని భావించాన’ని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. కానీ డేవిడ్ వార్నర్ అనుకున్నట్లుగానే చేసిన ఫలితం లభించకపోగా, టీమ్ ఓటమిపాలయింది.
కాగా, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన బ్యాటింగ్‌లో అక్షర్ పటేల్ 22 బంతుల్లోనే 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. కానీ, అతనికి డేవిడ్ వార్నర్ బౌలింగ్‌లో అవకాశం ఇవ్వకుండా పొరపాటు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమికి కారణమైంది. నిజానికి అక్షర్ పటేల్ వంటి ఆటగాడు తన జట్టులో ఉంటే ఏ కెప్టెన్ అయినా అతనిని పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటాడు. కానీ, గుజరాత్ టైటాన్స్‌పై డేవిడ్ వార్నర్ ఈ ఆల్‌రౌండర్ ప్లేయర్‌ను సగం మాత్రమే ఉపయోగించుకున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..