IPL 2022: ఇది జరిగితే చాలు.. మ్యాచ్ గెలిచినట్లే.. ఐపీఎల్‌లో నయా ట్రెండ్.. ఫ్యాన్స్‌కు సరికొత్త టెన్షన్..
ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. మూడింటిలోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించింది. దీంతో టీంలే కాదు, ఫ్యాన్స్ కూడా టాస్ గెలవాలని కోరుకుంటున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 15వ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఈ మూడు మ్యాచ్‌లు ముంబై(Mumbai)లోని వేర్వేరు మైదానాల్లో జరిగినా ఫలితం ఒక్కటే. మూడు మ్యాచ్‌ల్లోనూ సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే సులువుగా గెలిచాయి. ఇక్కడ ప్రతి కెప్టెన్ టాస్(Toss) గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. కెప్టెన్ల ఈ నిర్ణయం సరైనదని రుజువు కూడా అవుతోంది. ఇటువంటి పరిస్థితిలో ప్రస్తుతం IPL 2022 టాస్ గెలిచి మ్యాచ్ ఫార్ములాతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇది టాస్ గెలిచిన టీంలకు శుభవార్తలా ఉన్నా.. టాస్ ఓడిన జట్లతోపాటు ఫ్యాన్స్‌కు సరికొత్త టెన్షన్ పెట్టేలా తయారైంది. ఎందుకంటే, టాస్ గెలిచిన టీం గెలుస్తుండడంతో మ్యాచ్‌లు చూడలేం అంటూ ఫ్యాన్స్ నెట్టింట్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలానే జరిగితే, ఇకపై మ్యాచ్‌ల్లో మజా మిస్సయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.
మూడు మ్యాచ్‌ల్లోనూ ఇదే ట్రెండ్..
KKR vs CSK: వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన KKR కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక్కడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేస్తున్న చెన్నై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో చెన్నై 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత బ్యాట్‌పైకి బంతి బాగా రావడంతో చెన్నై చివరి 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 70 పరుగులు జోడించింది. అనంతరం 132 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ చాలా సులువుగా సాధించింది. దీంతో కేకేఆర్ 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి విజయం సాధించింది.
DC vs MI: బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలుత ఆడిన ముంబై 177 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఢిల్లీ ఆటగాళ్లు నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయారు. కానీ, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ తెలివిగా బ్యాటింగ్ చేసి, చివరి 105 పరుగులు చేయడంలో ఈ జట్టులో ఒక వికెట్ మాత్రమే పడిపోయింది. 178 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.2 ఓవర్లలో ఛేదించింది.
PBKS vs RCB: డీవై పాటిల్ స్టేడియంలోనూ అదే ట్రెండ్ కొనసాగింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఆటగాళ్లు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించారు. ఇక్కడ కూడా తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టుకు పెద్దగా కష్టాలు కనిపించలేదు.
ఐపీఎల్ అంతటా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా?
ప్రస్తుతం ముంబైలోని ఈ మూడు పిచ్‌లు ఒకే విధమైన ఫలితాలు అందించాయి. ముంబైలోని ఈ వికెట్లపై ప్రస్తుత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, ముందుగా బౌలింగ్ చేసే జట్టుకు ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ పిచ్‌లపై బౌలర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌ల్లో వాతావరణంలో పెద్దగా తేడా ఉండదు.