IPL vs PSL: ఐపీఎల్ బెస్ట్.. పీఎస్ఎల్ వేస్ట్ అంటోన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్.. ఎందుకంటే?
IPL 2008లో ప్రారంభమైంది. ప్రతీ ఏడాది ఇది మరింతగా పెద్దదిగా మారుతూ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ స్ఫూర్తితో ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్, పాకిస్తాన్‌లో పీఎస్‌ఎల్ వంటి టోర్నమెంట్‌లు ప్రారంభమయ్యాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ (IPL 2022) ప్రారంభమైంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన లీగ్ 15వ సీజన్‌కు చేరుకుంది. ఐపీఎల్ నిరంతరం పెరుగుతూనే ఉంది. IPL లీగ్‌లో చాలా మంది కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. ఇదే ఐపీఎల్ పాలిట కీలకంగా మారింది. వారు భారత జట్టులో తమ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, ఇతర దేశాలలో టీ20 లీగ్‌లు కూడా ఐపీఎల్ స్ఫూర్తిగా మొదలయ్యాయి. వాటిలో ఒకటి పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL). దాయాది దేశంలో జరుగుతున్న ఈ లీగ్‌కు కూడా మంచి పేరే ఉంది. ఇటువంటి పరిస్థితిలో కొన్నిసార్లు రెండింటిని పోల్చూతూ చాలామంది కామెంట్లు చేస్తూనే ఉన్నారు. వేర్వేరు వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఐపీఎల్‌తో పోలిస్తే పీఎస్‌ఎల్ (IPL vs PSL Comparison) ఇప్పటికీ వెనుకంజలోనే నిలిచింది. అయితే, ఇందుకు ప్రత్యేక కారణం ఉందని పాకిస్తాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ స్పష్టం చేశారు.
ఆ విషయంలో పీఎస్‌ఎల్ వెనుకంజలోనే..
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఇంకా వెనుకంజలోనే ఉందని, గత 15 ఏళ్లుగా నిర్వహిస్తున్నా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాలా ముందుందని పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా(Danish Kaneria) పేర్కొన్నాడు. దీనికి ప్రధాన కారణాన్ని తెలియజేస్తూ, IPL సంవత్సరాలుగా క్రికెట్ ప్రపంచానికి చాలా మంది కొత్త, మెరుగైన యువ ఆటగాళ్లను అందించిందని, వారు తమ ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారని, ఈ విషయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ ఈ విషయంలో పెద్దగా విజయం సాధించలేకపోయిందని కనేరియా పేర్కొన్నాడు.
ఐపీఎల్‌తో ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి..
డానిష్ కనేరియా తరచుగా పాకిస్థాన్ క్రికెట్ గురించి బహిరంగంగా మాట్లాడేవాడు. అతను రెండు జట్ల గురించి కూడా చాలా సార్లు తేడా చెప్పాడు. ప్రస్తుతం IPL, PSL తేడాల గురించి మాట్లాడుతూ, “ఒక ప్రొఫెషనల్ టోర్నమెంట్ అయిన IPL భారత క్రికెట్‌కు చాలా ప్రతిభ గల ప్లేయర్లను ఇస్తోంది. పాకిస్తానీ క్రికెట్ కోసం PSL ఏమీ చేయడం లేదు. అయితే ఇది గడిచే ప్రతి సీజన్‌లో మెరుగుపడుతోంది. ఒక ఆటగాడు PSLలో బాగా రాణిస్తే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహారంతో జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలను పాడు చేస్తుంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ భారీ ఈవెంట్..
“IPL అనేది ప్రతి ఆటగాడు ఆడాలనుకునే టోర్నమెంట్. ఐపీఎల్‌లో ఆడేందుకు దక్షిణాఫ్రికాకు చెందిన చాలా మంది ఆటగాళ్లు తమ జాతీయ జట్టు నుంచి సెలవు తీసుకున్నారని తెలిసిందే. ఇటువంటి పరిస్థితిలో ఇది ప్రతి సంవత్సరం ఒక భారీ ఈవెంట్‌గా రూపొందుతోంది” అంటూ పేర్కొ్న్నాడు.
IPL 2008లో ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే మొదటి ప్రధాన T20 లీగ్‌గా గుర్తింపు పొందింది. ఇది చూసి 2010లో ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ మొదలుపెట్టింది. అదే సమయంలో, 8 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను 2016లో ప్రారంభించింది. వీటితో పాటు కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీలు కూడా మొదలయ్యాయి.