IPL 2022 Mega Auction: ఐపీఎల్‌ వేలంలో రూ.20కోట్లు దాటనున్న బిడ్డింగ్.. ఆ లిస్టులో ఎవరున్నారంటే?

|

Jan 26, 2022 | 1:43 PM

IPL 2022: వేలం కోసం మొత్తం 1214 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈసారి ఐపిఎల్‌లో మరో రెండు కొత్త జట్లు చేరాయి. కీలక ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడనున్నాయి.

IPL 2022 Mega Auction: ఐపీఎల్‌ వేలంలో రూ.20కోట్లు దాటనున్న బిడ్డింగ్.. ఆ లిస్టులో ఎవరున్నారంటే?
Ipl 2022 Mega Auction
Follow us on

IPL 2022 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2022 (IPL 2022) మెగా వేలానికి మరికొద్ది రోజులే మిగిలి ఉంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వేలం నిర్వహించాలని బీసీసీఐ(BCCI) నిర్ణయించింది. మొత్తం 1214 మంది ఆటగాళ్లు వేలం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఈసారి ఐపిఎల్‌లో మరో రెండు కొత్త జట్లు చేరాయి. దీంతో ఆటగాళ్ల కోసం పది జట్లు తీవ్రంగా పోటీపడనున్నాయనడంలో సందేహం లేదు. ఈసారి అత్యంత విలువైన ఆటగాడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ 16.25 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించాడు. అతన్ని రాజస్థాన్ రాయల్స్(RR) కొనుగోలు చేసింది. అదే సమయంలో, ఈ ఏడాది వేలంలో ఒకరి కంటే ఎక్కువ వెటరన్ ప్లేయర్లు ఉంటారు. వారి బిడ్ రూ. 20 కోట్లకు పైగా ఉండవచ్చని తెలుస్తోంది.

డేవిడ్ వార్నర్ – ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ ప్రస్తుత యుగంలోని అత్యంత తుఫాన్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. వార్నర్‌కు కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. అతని నాయకత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

సన్‌రైజర్స్ అతడిని విడుదల చేసినప్పటికీ.. వార్నర్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీల మధ్య పోటీ తప్పదు. వేలంలో అతను రూ.20 కోట్ల స్లాబ్‌ను దాటగలడని విశ్లేషకులు భావిస్తున్నారు.

మిచెల్ మార్ష్- ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆల్-రౌండర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో బ్యాట్, బాల్ రెండింటిలోనూ రికార్డులు సృష్టిస్తాడు. టీ20లో ఆస్ట్రేలియా తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. మార్ష్‌ను తమ టీంలో చేర్చుకోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు. మార్ష్ కోసం రూ. 20 కోట్లకు పైగా బిడ్‌ వేయవచ్చని తెలుస్తోంది.

పాట్ కమిన్స్- ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్. అతను ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్. టీ20లోనూ అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. IPL 2020లో, KKR అతన్ని రూ. 15.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఫ్రాంచైజీ అతన్ని 2021లో విడుదల చేసింది. ఈసారి కమిన్స్ రూ.20 కోట్లకు పైగా రేట్ దక్కించుకోగలడని తెలుస్తోంది.

క్వింటన్ డి కాక్ – ఈ దక్షిణాఫ్రికా వికెట్-కీపర్ బ్యాట్స్‌మెన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫుల్ ఫాంలో ఉన్నాడు. తాజాగా టీమిండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో డి కాక్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఐపీఎల్ వేలంలో అతడి విలువ పెరగడం ఖాయం. డికాక్ కీపింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. వన్డే సిరీస్‌లో రిషబ్ పంత్, వెంకటేష్ అయ్యర్‌లను స్టంపౌట్ చేసి ఆకట్టుకున్నాడు.

ట్రెంట్ బౌల్ట్- న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ IPL చివరి సీజన్ వరకు ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఫ్రాంచైజీ అతన్ని విడుదల చేసింది. గత రెండు సీజన్లలో బోల్ట్ ముంబైకి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా మారాడు. అతను ప్రపంచంలోని అత్యుత్తమ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. చాలా మంది ఫ్రాంచైజీలు అతనిపై దృష్టి పెట్టాయి. ఫ్రాంఛైజీ వారిని చేర్చుకోవడానికి భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చని తెలుస్తోంది.

Also Read: Team India: గణతంత్రం రోజున కివీస్‌ను గడగడలాడించిన భారత్.. హిట్‌మ్యాన్‌ స్పీడ్‌కు తోడైన ధనాధన్ ధోనీ..!

Team India: అడిలైడ్‌లో అదరగొట్టిన భారత్.. విరాట్ విశ్వరూపం, ధోనీ మార్క్‌ ఫినిషింగ్‌తో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం