ఐర్లాండ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ సిమ్రంజీత్ సింగ్ అలియాస్ సిమి సింగ్ లీవర్ కు సంబంధించి ఇటీవల ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. భారత సంతతికి చెందిన ఈ స్టార్ క్రికెటర్ తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో ఆస్పత్రిలో చేరాడు. కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న అతను గురుగ్రామ్‌లోని మెదాంతలోని ఐసీయూలో చేరాడు. అయితే కాలేయ మార్పిడి చేస్తే కానీ సిమి సింగ్ బతకడని డాక్టర్లు చెప్పారు. అయితే తాజాగా ఇప్పుడు సిమి సింగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. తన భార్య కాలేయ దానం చేసి తన ప్రాణాన్ని కాపాడిందని అందులో చెప్పుకొచ్చాడు. తన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని సిమి సింగ్ తాజాగా వెల్లడించారు. అతను ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడీ స్టార్ క్రికెటర్. ‘హాయ్ ఫ్రెండ్స్.నా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఇది 12 గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స. ఇప్పుడు నేను కోలుకునే ప్రక్రియలో ఉన్నాను. తప్పుడు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ తీసుకోవడంతో నా కాలేయం దెబ్బతింది. అయితే చివరకు నా భార్య చివరికి దాతగా మారి నాకు కాలేయ దానం చేసింది. నేను చాలా అదృష్టవంతుడిని. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు
సిమి సింగ్
3 7 ఏళ్ల సిమి సింగ్ ఇప్పటి వరకు ఐర్లాండ్ తరఫున 35 వన్డేలు, 53 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 39 వికెట్లు, టీ20లో 44 వికెట్లు తీశాడు. దీంతోపాటు వన్డేలో 1 సెంచరీ, టీ20లో 296 పరుగుల సాయంతో 593 పరుగులు చేశాడు. అతను చివరిసారిగా 2022 T20 ప్రపంచ కప్‌లో అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఆడాడు. సిమి సింగ్ భారత సంతతికి చెందిన ఆటగాడు. పంజాబ్‌లో జన్మించిన సిమి సింగ్ భారతదేశంలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఇది మాత్రమే కాదు, అతను పంజాబ్ తరపున అండర్ -15 మరియు అండర్ -17 జట్లలో ఆడాడు. అతను విరాట్ కోహ్లీ, యుజ్వేంద్ర చాహల్, సిద్ధార్థ్ కౌల్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. సిమి సింగ్ ఐర్లాండ్ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..