
BCCI : ఆసియా కప్ 2025కు ముందు బీసీసీఐకి ఊహించని షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల బీసీసీఐ భారీగా ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ లా – 2025.. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్ – 2025 అనే కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టాల వల్ల ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలతో ఉన్న స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను రద్దు చేసుకోవడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్ – 2025, లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, వాటి ప్రమోటర్లను నిషేధిస్తారు. ఈ చట్టం బీసీసీఐకి పెద్ద సమస్యగా మారవచ్చు. ఎందుకంటే డ్రీమ్11 టీమిండియాకు స్పాన్సర్‌గా ఉంది. అలాగే మై11సర్కిల్ ఐపీఎల్ ఫాంటసీ హక్కులను వచ్చే మూడు సంవత్సరాలకు కలిగి ఉంది.
కొత్త చట్టాలపై దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. “ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మేము దానిని పరిశీలిస్తాం. అది అనుమతించదగినది అయితేనే ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ సంస్థల నుంచి స్పాన్సర్‌షిప్ తీసుకుంటాం. ఒకవేళ అది అనుమతించబడకపోతే మేము ఏమీ చేయం” అని అన్నారు. సిగరెట్, మద్యం బ్రాండ్స్‌ను నిషేధించినప్పుడు బీసీసీఐ వాటి నుంచి ఎలాంటి స్పాన్సర్‌షిప్ తీసుకోలేదని ఆయన ఉదాహరణగా చెప్పారు. దేశంలో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఏది అనుమతించదగినదో అది మాత్రమే బీసీసీఐ చేస్తుందని సైకియా స్పష్టం చేశారు.
కొత్త నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ లా 2025 ప్రకారం.. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్‌పై భారత్ నిషేధాన్ని కొనసాగించనుంది. అయితే, అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో మాత్రం పాల్గొనడానికి అనుమతిస్తుంది. ఈ విధానం వల్ల టీమిండియా యూఏఈలో జరగనున్న ఆసియా కప్ 2025లో పాల్గొననుంది. అక్కడ సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో తలపడుతుంది. అయితే, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌ల కోసం భారత్‌లో పర్యటించడానికి వీలులేదు.
కశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, ఆ తర్వాత మే నెలలో రెండు దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుంచి విమర్శలు వచ్చినా, ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనడం మాత్రం కొనసాగుతుంది. దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. స్పాన్సర్‌షిప్‌లు, అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనడంతో సహా అన్ని క్రీడా సంబంధిత విషయాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలకు బీసీసీఐ పూర్తిగా కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఆటగాళ్ల, జట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని, భవిష్యత్తులో భారత్‌లో జరిగే టోర్నమెంట్‌లకు కూడా ఈ విధానాలు వర్తిస్తాయని ఆయన తెలిపారు.
“భారత ప్రభుత్వం ఆటగాళ్లు, జట్లు, భవిష్యత్తులో మన దేశంలో జరిగే ఈవెంట్‌ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. మరియు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విధానాలకు 100% కట్టుబడి ఉంటాం. బీసీసీఐ ప్రభుత్వ విధానాలకు ఒక్క అంగుళం కూడా వ్యతిరేకంగా వెళ్లదు. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లో పాల్గొనడం లేదా స్పాన్సర్‌షిప్‌లకు సంబంధించిన అన్ని విధానాలకు మేము పూర్తిగా కట్టుబడి ఉంటాం” అని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..