Team India: 11 వేల పరుగులు, జూనియర్ సచిన్‌గా బిరుదు.. కట్ చేస్తే.. అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్ నెగ్గాడు

India Women's Team Coach Amol Muzumdar: అమోల్ ముజుందార్ మార్గదర్శకత్వంలోనే భారత మహిళల జట్టు ఓటమిల నుంచి పాఠాలు నేర్చుకుంది. సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై చారిత్రక ఛేజింగ్‌ను సాధించి, ఫైనల్‌లో సత్తా చాటి తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

Team India: 11 వేల పరుగులు, జూనియర్ సచిన్‌గా బిరుదు.. కట్ చేస్తే.. అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్ నెగ్గాడు
Amol Muzumdar

Updated on: Nov 03, 2025 | 1:48 PM

India Women’s Team Coach Amol Muzumdar: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన వేళ, క్రీడాభిమానుల దృష్టి మొత్తం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, సెంచరీ వీరవనిత జెమీమా రోడ్రిగ్స్ వంటి ఆటగాళ్లపై ఉంది. అయితే, ఈ చారిత్రక విజయం వెనుక అమోల్ ముజుందార్ అనే నిస్వార్థ కోచ్ కృషి కూడా ఉంది. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో 11,000కు పైగా పరుగులు సాధించినా, భారత జట్టు జెర్సీని ధరించే అదృష్టం దక్కని బ్యాడ్ లక్ క్రికెటర్ ఇతను.

ముజుందార్ జీవితం ఒకవైపు అద్భుతమైన దేశవాళీ లెజెండ్‌గా, మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేకపోయిన దురదృష్టవంతుడిగా నిలిచిపోతుంది. కానీ, కాలం ఆయనకు గొప్ప అవకాశం ఇచ్చింది. తను సాధించలేని కలను తన శిష్యురాళ్లతో నెరవేర్చుకునే అద్భుతమైన పాత్రను ఇచ్చింది.

దేశవాళీ క్రికెట్‌లో ‘నెక్స్ట్ సచిన్’..

అమోల్ ముజుందార్‌ను భారత దేశవాళీ క్రికెట్‌లో అత్యంత స్థిరమైన, ధృఢమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణిస్తారు. ముజుందార్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తో పాటు లెజెండరీ కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌ వద్దే శిక్షణ పొందారు. అందుకే ఆయనను ఒకప్పుడు ‘జూనియర్ సచిన్’ అని పిలిచేవారు.

అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు: 1993-94 రంజీ ట్రోఫీ సీజన్‌లో ముంబై తరపున హర్యానాపై తన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లోనే ఏకంగా 260 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. తన 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో, ముంబై, అస్సాం, ఆంధ్రప్రదేశ్ వంటి జట్ల తరపున మొత్తం 171 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 30 సెంచరీలు సహా 11,167 పరుగులు సాధించారు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డుల్లో ఆయన పేరు నిలిచింది.

ఇంత అద్భుతమైన గణాంకాలు ఉన్నా, ఆ సమయంలో భారత జట్టు మిడిల్ ఆర్డర్‌లో సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్ వంటి దిగ్గజ ఆటగాళ్ల పోటీ కారణంగా ముజుందార్‌కు సీనియర్ జాతీయ జట్టులో చోటు దక్కలేదు.

కోచ్‌గా రూపాంతరం.. ‘చక్ దే ఇండియా’ మూమెంట్..

ఆటగాడిగా జాతీయ జట్టు తరపున ఆడాలన్న కల నెరవేరకపోయినా, క్రికెట్‌పై ఆయనకున్న ప్రేమ, అపారమైన అనుభవం కోచింగ్ వైపు మళ్లించాయి. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు, దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశారు.

భారత మహిళా జట్టు కోచ్‌గా నియామకం..

2023 అక్టోబర్‌లో భారత మహిళా జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ముజుందార్, జట్టుకు కొత్త దిశానిర్దేశం చేశారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం, “సార్ మాట్లాడిన ప్రతి మాట మా హృదయం నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. మేమంతా ఆయనను నమ్ముతాం” అని చెప్పడం, ఆటగాళ్లపై ఆయన ప్రభావం ఎంత ఉందో తెలియజేస్తుంది.

ముజుందార్ కోచింగ్ శైలి ప్రశాంతంగా, ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చే విధంగా ఉంటుంది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ ముందు ఆయన డ్రెస్సింగ్ రూమ్ బోర్డుపై రాసిన ఒకే ఒక్క సందేశం “మనకు వారి కంటే ఒక్క పరుగు ఎక్కువ కావాలి” (We just need one more run than them) – ఇది ఎలాంటి హంగామా లేని, కేవలం లక్ష్యంపై దృష్టి పెట్టే ఆయన నాయకత్వ లక్షణానికి నిదర్శనం.

శిష్యురాళ్లతో కప్పు కల నెరవేర్చుకున్న గురువు..

ముజుందార్ మార్గదర్శకత్వంలోనే భారత మహిళల జట్టు ఓటమిల నుంచి పాఠాలు నేర్చుకుంది. సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై చారిత్రక ఛేజింగ్‌ను సాధించి, ఫైనల్‌లో సత్తా చాటి తొలిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

ఆటగాడిగా తాను అందుకోలేని జాతీయ కప్పును, కోచ్‌గా తన శిష్యురాళ్లతో అందుకున్న అమోల్ ముజుందార్ ప్రయాణం.. కల ఎప్పటికీ చావదు , రూపం మారినా అది ఏదో ఒక రోజు తప్పక నెరవేరుతుంది అని చెప్పకనే చెప్పింది. భారత క్రికెట్ చరిత్రలో ముజుందార్ పేరు ఇప్పుడు కోచ్‌గా సువర్ణాక్షరాలతో లిఖితమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..