
India vs South Africa : భారత మహిళల జట్టు, సౌతాఫ్రికా మహిళల జట్టు మధ్య జరగబోయే ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌పై ఉత్కంఠతతో పాటు వర్షం భయం కూడా అలుముకుంది. ఈ చారిత్రక మ్యాచ్ నేడు (నవంబర్ 2, ఆదివారం) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే అనేక మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించడంతో, ఫైనల్ మ్యాచ్‌పై కూడా వాన ప్రభావం ఉంటుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మ్యాచ్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాగే సమయంలో వర్షం వచ్చే 49% నుంచి 58% అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈరోజు (నవంబర్ 2) మధ్యాహ్నం 3 గంటలకు భారత్-దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచ కప్ ఫైనల్ ప్రారంభం కానుంది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు టాస్ జరగాల్సి ఉంది. అయితే, AccuWeather నివేదిక ప్రకారం, మధ్యాహ్నం 2 గంటల సమయంలో వర్షం పడే అవకాశం 15 శాతం ఉంది. మ్యాచ్ మొదలయ్యే 3 గంటల సమయానికి వర్షం పడే అవకాశం 20 శాతం వరకు పెరగవచ్చు. దీని కారణంగా టాస్, మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఫైనల్ మ్యాచ్ కోసం టాస్ మధ్యాహ్నం 3:00 గంటలకు జరుగుతుంది. వర్షం, తడిగా ఉన్న అవుట్ ఫీల్డ్ కారణంగా టాస్ ఆలస్యమైంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.
మ్యాచ్ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సాగే కొద్దీ వర్షం పడే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వర్షం పడే అవకాశం 49 శాతం వరకు పెరుగుతుంది. ఆ తర్వాత, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య వర్షం పడే అవకాశం 51 శాతం నుంచి 58 శాతం వరకు ఉంటుంది. ఈ సమయంలో భారీ వర్షం పడితే, మ్యాచ్‌ను కొంతసేపు నిలిపివేయాల్సి రావొచ్చు. దీని కారణంగా ఓవర్లను తగ్గించే అవకాశం ఉంది. అయితే, సాయంత్రం 7 గంటల తర్వాత వర్షం పడే అవకాశం బాగా తగ్గి, కేవలం 20 శాతానికి తగ్గుతుందని వాతావరణ నివేదిక అంచనా వేసింది.
ఈ టోర్నమెంట్‌లో నవీ ముంబైలో జరిగిన అనేక మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించింది. ఒక భారత మ్యాచ్ పూర్తిగా రద్దయ్యింది కూడా. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైతే ఐసీసీ రూల్స్ ఇలా ఉంటాయి. ఐసీసీ ఎల్లప్పుడూ తన టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేను కేటాయిస్తుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు కూడా రిజర్వ్ డే ఉంది. ఒకవేళ నవంబర్ 2న మ్యాచ్ పూర్తి కాకపోతే, అది నవంబర్ 3న కొనసాగుతుంది. అయితే దీని అవసరం రాకపోవచ్చని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి.