India vs Pakistan : మేం రెడీ..వాళ్లే వణుకుతున్నారు..పాక్ ప్లాన్ రివర్స్..సూర్య ఇచ్చిన దెబ్బకు పీసీబీ షాక్

India vs Pakistan : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నెలకొన్న బాయ్ కాట్ వివాదం ముదురుతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన హై-ప్రొఫైల్ మ్యాచ్‌ను తాము ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించగా, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మౌనాన్ని వీడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

India vs Pakistan : మేం రెడీ..వాళ్లే వణుకుతున్నారు..పాక్ ప్లాన్ రివర్స్..సూర్య ఇచ్చిన దెబ్బకు పీసీబీ షాక్
Suryakumar Yadav

Updated on: Feb 05, 2026 | 5:40 PM

India vs Pakistan : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య నెలకొన్న బాయ్ కాట్ వివాదం ముదురుతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన హై-ప్రొఫైల్ మ్యాచ్‌ను తాము ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించగా, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మౌనాన్ని వీడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ముంబైలో జరిగిన కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ఈ వివాదంపై స్పష్టతనిచ్చారు. “మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. మేం మ్యాచ్ ఆడబోమని ఎప్పుడూ చెప్పలేదు. నిరాకరించింది అవతలి పక్షం (పాకిస్థాన్) వారే. ఐసీసీ షెడ్యూల్ ఇచ్చింది, భారత్-పాక్ ప్రభుత్వాలు తటస్థ వేదికపై (కొలంబో) ఆడాలని నిర్ణయించాయి. మా ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి, మేం కచ్చితంగా కొలంబో వెళ్తున్నాం” అని సూర్య ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 15న మైదానంలోకి రావాలా వద్దా అనేది పాకిస్థాన్ నిర్ణయమని, తాము మాత్రం మ్యాచుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని సూర్య స్పష్టం చేశారు.

పాకిస్థాన్ ఎందుకు బహిష్కరిస్తోంది?

బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి తప్పించి స్కాట్లాండ్‌ను చేర్చడాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ఆయన ప్రకటించారు. అయితే కేవలం భారత్‌తో మ్యాచ్ మాత్రమే ఆడమని చెప్పడంపై ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలా సెలెక్టివ్ పార్టిసిపేషన్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, దీనివల్ల పాక్ క్రికెట్ బోర్డు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఫోర్స్ మెజూర్ క్లాజ్ అంటే ఏమిటి?

ఐసీసీ విధించబోయే కఠినమైన జరిమానాల నుంచి తప్పించుకోవడానికి పీసీబీ ఒక కొత్త ఎత్తుగడ వేస్తోంది. ఫోర్స్ మెజూర్ అనే క్లాజ్‌ను తెరపైకి తెస్తోంది. అంటే, “అనుకోని విపత్కర పరిస్థితుల వల్ల మేము ఒప్పందాన్ని నెరవేర్చలేకపోతున్నాం” అని వాదించే ప్రయత్నం చేస్తోంది. తమ ప్రభుత్వం ఆడవద్దని ఆదేశించిందని, ఇది తాము ఊహించని పరిణామమని ఐసీసీకి చెప్పాలని చూస్తోంది. కానీ, బీసీసీఐ, ఇతర బోర్డులు మాత్రం ఇది కేవలం రాజకీయ కారణమే తప్ప, అనివార్య పరిస్థితి కాదని వాదిస్తున్నాయి.

భారీ జరిమానాలు, న్యాయపరమైన చిక్కులు

ఒకవేళ పాకిస్థాన్ ఫిబ్రవరి 15న మైదానంలోకి రాకపోతే, భారత్‌కు నేరుగా రెండు పాయింట్లు లభిస్తాయి. కానీ సమస్య అక్కడితో ఆగదు. పాకిస్థాన్ బోర్డుకు ఏడాదికి వచ్చే సుమారు 35-38 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.300 కోట్లు) ఆదాయాన్ని ఐసీసీ నిలిపివేసే అవకాశం ఉంది. అలాగే అధికారిక బ్రాడ్‌కాస్టర్లు కూడా భారీ నష్టపరిహారం కోరుతూ కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాను పీసీబీతో చర్చల కోసం పంపింది. మరి ఫిబ్రవరి 15 నాటికి పాక్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేదో చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి