AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: పాకిస్థాన్‌పై రో-కో జోడి చెలరేగేనా? దాయాదిపై రోహిత్‌, కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు చాలా కీలకం. కోహ్లీ పాకిస్థాన్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు, ముఖ్యంగా 2022 టీ20 వరల్డ్ కప్‌లో 82 నాటౌట్ ఇన్నింగ్స్ మర్చిపోలేనిది. అలాగే రోహిత్ కూడా పాకిస్థాన్‌పై అనేక విజయవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన రికార్డ్ ఉంది. వీరిద్దరి ఫామ్ భారత విజయానికి కీలకం. ఈ మ్యాచ్‌లో వారి ప్రదర్శనపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

IND vs PAK: పాకిస్థాన్‌పై రో-కో జోడి చెలరేగేనా? దాయాదిపై రోహిత్‌, కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..?
Rohit Kohli
SN Pasha
|

Updated on: Feb 23, 2025 | 9:04 AM

Share

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా ఈ రోజు(ఫిబ్రవరి 23, ఆదివారం) ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా 2.30 గంటల నుంచి ఈ దాయాది పోరు ప్రారంభం కానుంది. ఐసీసీ ఈవెంట్స్‌లో పాకిస్థాన్‌పై ఇండియాకు మంచి రికార్డ్‌ ఉన్నప్పటికీ.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో మాత్రం పాక్‌ కొన్నిసార్లు మనపై పైచేయి సాధించింది. అయితే.. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఇద్దరు సూపర్‌ స్టార్‌ ప్లేయర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలకు పాకిస్థాన్‌పై అద్భుతమైన రికార్డ్‌ ఉంది. దీంతో.. ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌తో మ్యాచ్‌లో వాళ్లిద్దరూ రాణించాలని భారత క్రికెట్‌ అభిమానులంతా కోరుకుంటున్నారు. బహుషా వీరిద్దరికి ఇదే ఆఖరి ఛాంపియన్స్‌ ట్రోఫీ అవుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఇద్దరూ కలిసి మరో ఐసీసీ ట్రోఫీని గెలవాలని అంతా కోరుకుంటున్నారు.

విరాట్‌ కోహ్లీ సరైన ఫామ్‌లో లేకపోవడం భారత క్రికెట్‌ అభిమానులను కాస్త కలవరపెడుతున్నా.. పాకిస్థాన్‌ అంటే చాలు ఎక్కడలేని ఎనర్జీతో ఆడే విరాట్‌ కోహ్లీ.. ఈ మ్యాచ్‌తో తన పూర్వపు ఫామ్‌ను అందుకుంటాడని ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. మరి పాకిస్థాన్‌పై కోహ్లీ ఎలాంటి రికార్డ్‌ ఉందో ఓ సారి చూద్దాం.. ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. 2022 టీ20 వరల్డ్‌ కప్‌లో మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ గురించి మాట్లాడుకోవాలి. ఆ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ 82 పరుగులతో ఓటమి ఓరల్లో చిక్కుకున్న టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైన సమయంలో హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌లో కొట్టిన రెండు వరుస సిక్సర్లు, అందులోనూ స్ట్రేయిట్‌గా కొట్టిన సిక్స్‌ అయితే ప్రపంచ క్రికెట్‌లోనే అతి గొప్ప షాట్‌గా నిలిచిపోయింది. దాన్ని ఐసీసీ షాట్‌ ఆఫ్‌ ది సెంచరీగా అభివర్ణించింది.

అలాగే 2015 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా అడిలైడ్‌లో పాక్‌పై కొట్టిన సెంచరీ(107 నాటౌట్‌), 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో బర్మింగ్‌హామ్‌లో కొట్టిన 81(నాటౌట్‌), టీ20 వరల్డ్‌ కప్‌ 2012లో కోలంబోలో ఆడిన 78(నాటౌట్‌), టీ20 వరల్డ్‌ కప్‌ 2019లో మాంచెస్టర్‌లో ఆడిన 77 పరుగుల ఇన్నింగ్స్‌లో పాక్‌పై కోహ్లీ ఐసీసీ ఈవెంట్స్‌లో ఆడిన టాప్‌ ఇన్నింగ్స్‌లుగా చెప్పుకోవచ్చు. వీటిలో మెల్‌బోర్న్‌లో ఆడిన 82(నాటౌట్‌) ఇన్నింగ్స్‌ కోహ్లీకి జీవిత కాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌. అయితే పాకిస్థాన్‌పై కోహ్లీ ఆడిన టాప్‌ 5 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సార్లు అసలు అవుటే కాలేదు. అది పాక్‌పై కోహ్లీకి ఉన్న తిరుగులేని రికార్డును సూచిస్తోంది.

ఇక రోహిత్‌ శర్మ విషయానికి వస్తే.. ఐసీసీ ఈవెంట్స్‌లో పాక్‌పై అంత మంచి రికార్డ్‌ లేకపోయినా.. ప్రస్తుతం రోహిత్‌ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఈ సారి పాక్‌కు ముప్పు తప్పేలా లేదు. ఓవరాల్‌గా పాక్‌పై 19 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ 51.35 యావరేజ్‌తో 873 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, 8 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 2018 ఆసియా కప్‌లో పాక్‌పై రోహిత్‌ సెంచరీ(111) సాధించాడు. అలాగే 2019 వన్డే వరల్డ్‌ కప్‌లో మాంచెస్టర్‌ వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 140 పరుగులు చేశాడు. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ సందర్భంగా అహ్మాదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 63 బంతుల్లో 86 పరుగులు సాధించాడు రోహిత్‌ శర్మ. ఇలా పాక్‌పై ఈ రోకో జోడీకి ఉన్న తిరుగులేని రికార్డును ఈ సారి కూడా అలాగే కొనసాగించాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.