Ind vs Eng : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. 18 సెంచరీలతో రికార్డులు బద్దలు.. ముందంజలో భారత్

భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఏకంగా 18 సెంచరీలు నమోదయ్యాయి. శుభమన్ గిల్, బెన్ స్టోక్స్ సహా భారత బ్యాట్స్‌మెన్‌లు సెంచరీల ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీల వర్షం కురిపించారు. సునీల్ గవాస్కర్ రికార్డుకు శుభమన్ గిల్ ఎంత దగ్గరగా ఉన్నాడో వివరంగా తెలుసుకుందాం.

Ind vs Eng : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. 18 సెంచరీలతో రికార్డులు బద్దలు.. ముందంజలో భారత్
England Test Series

Updated on: Jul 29, 2025 | 11:46 AM

Ind vs Eng : భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు బ్యాట్స్‌మెన్‌ల హవానే కొనసాగింది. రెండు జట్ల బ్యాట్స్‌మెన్‌లు కలిసి టెస్ట్ క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ జరగని రీతిలో రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా భారత యువ సంచలనం శుభమన్ గిల్ ఒకే టెస్ట్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేసి చరిత్ర సృష్టిస్తే, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఒక టెస్ట్‌లో 5 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ సాధించి తన పేరును రికార్డు పుస్తకాల్లో లిఖించుకున్నాడు. సాధారణంగా ఇంగ్లాండ్ పిచ్‌లు పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉంటాయని, మేఘావృతమైన వాతావరణంలో స్వింగ్, సీమ్ కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు టెస్టుల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ, మేఘాలు ఉన్నప్పటికీ, ఈ కఠిన పరిస్థితుల్లో కూడా బ్యాట్స్‌మెన్‌లే అదరగొట్టారు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఏకంగా 18 సెంచరీలు నమోదయ్యాయి.

మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌లో మొత్తం 5 సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో 3 సెంచరీలు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో శుభమన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా బ్యాట్ నుంచి వచ్చాయి. ఈ మూడు సెంచరీల పుణ్యమా అని నాలుగో టెస్ట్‌ను డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మొత్తం 18 సెంచరీలు నమోదయ్యాయి. వాటిలో అత్యధిక సెంచరీలు భారత బ్యాట్స్‌మెన్‌లు సాధించారు. మొత్తం 18 సెంచరీలలో, 11 సెంచరీలు భారత బ్యాట్స్‌మెన్‌లు సాధించగా, 7 సెంచరీలు మాత్రమే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లు చేశారు. శుభమన్ గిల్ ఈ సిరీస్‌లో ఏకంగా 4 సెంచరీలు కొట్టి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

ఏ భారత బ్యాట్స్‌మెన్‌లు ఎన్ని సెంచరీలు చేశారో చూద్దాం:

శుభమన్ గిల్: 4 సెంచరీలు

రిషబ్ పంత్: 2 సెంచరీలు

కేఎల్ రాహుల్: 2 సెంచరీలు

రవీంద్ర జడేజా: 1 సెంచరీ

వాషింగ్టన్ సుందర్: 1 సెంచరీ

యశస్వి జైస్వాల్: 1 సెంచరీ

ఇక ఇంగ్లాండ్ తరఫున జో రూట్ 2 సెంచరీలు చేయగా, బెన్ స్టోక్స్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జేమ్స్, ఓలీ పోప్ తలో సెంచరీ సాధించారు. సెంచరీల విషయంలో టీమిండియా ఇంగ్లాండ్‌ను అధిగమించింది. ఈ సిరీస్‌లో చివరి టెస్ట్ ఇంకా మిగిలి ఉంది. ఇది జులై 31 నుంచి ది ఓవల్ స్టేడియంలో జరగనుంది.

ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్ట్‌లో శుభమన్ గిల్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 11 పరుగులు చేస్తే చాలు. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా అతను రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరుతో ఉంది. గవాస్కర్ 1978-79లో ఒక సిరీస్‌లో 732 పరుగులు సాధించారు. గిల్ ఇప్పటివరకు ఆడిన 4 టెస్టుల్లో మొత్తం 722 పరుగులు చేశాడు. చివరి టెస్ట్‌లో ఈ 11 పరుగులు సాధించి గవాస్కర్ రికార్డును బద్దలు కొడతాడా లేదా అనేది ఆసక్తిగా మారింది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..