Team India: అప్పుడు ధోని.. ఇప్పుడు రోహిత్ శర్మ.. ఊరించి ఊసురుమనిపించారు.. టీమిండియా ఓటమికి 4 కారణాలివే!

|

Dec 08, 2022 | 10:07 AM

బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా పేలవమైన ఆటతీరును కనబరిచింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా..

Team India: అప్పుడు ధోని.. ఇప్పుడు రోహిత్ శర్మ.. ఊరించి ఊసురుమనిపించారు.. టీమిండియా ఓటమికి 4 కారణాలివే!
Ind Vs Ban
Follow us on

బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా పేలవమైన ఆటతీరును కనబరిచింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా పరాజయాన్ని ఎదుర్కుంది. దీంతో వరుసగా రెండోసారి బంగ్లాదేశ్ చేతుల్లో వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 271 పరుగులకు ఆలౌటైంది. ఇక లక్ష్యచేదనలో టీమ్ ఇండియా 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 266 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ(51)తో పాటు అక్షర్ పటేల్(56), శ్రేయాస్ అయ్యర్(82) కూడా అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. కానీ చివరికి విజయాన్ని అందించలేకపోయారు. మరి అసలు టీమిండియా ఓటమికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

టాప్ త్రీ విఫలం:

టీమిండియాకు బ్యాటర్లే ప్రధాన ప్లస్ పాయింట్. అయితే ODI సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ రెండు మ్యాచ్‌ల్లోనూ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా.. కెఎల్ రాహుల్ తొలి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి, రెండో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఈ ముగ్గురు బాగా రాణించి ఉంటే.. కచ్చితంగా సిరీస్ మనదే అయ్యేది.

ఫలించని బౌలర్ల మ్యాజిక్:

టీమిండియా బౌలర్లు కూడా తమ ప్రదర్శనతో నిరాశపరిచారు. తొలి మ్యాచ్‌లో టీమిండియాకు విజయావకాశాలు ఉన్నా బంగ్లాదేశ్‌ చివరి వికెట్‌ను మన బౌలర్లు తీయలేకపోయారు. చివరి వికెట్‌కు ముస్తాఫిజుర్, మెహదీ హసన్ మిరాజ్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. రెండో మ్యాచ్‌లోనూ అదే జరిగింది. ఒకానొక సమయంలో బంగ్లాదేశ్ కేవలం 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. టీమిండియా బౌలర్లు మరో వికెట్ తీయడంలో విఫలం కావడంతో బంగ్లాదేశ్ పుంజుకుంది. తద్వారా నిర్ణీత 50 ఓవర్లకు 271 పరుగులు చేయగలిగింది.

పేలవమైన ఫీల్డింగ్:

వన్డే సిరీస్‌లో టీమిండియా ఫీల్డింగ్ కూడా నిరాశపరిచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తొలి మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సులువైన క్యాచ్‌ని మిస్ చేయడం, వాషింగ్టన్ సుందర్ మిరాజ్ క్యాచ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించకపోవడం ఆ జట్టుకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఈ క్యాచ్‌లు పట్టి ఉంటే.. టీమిండియా సిరీస్‌ను కోల్పోకుండా ఉండేది.

కెప్టెన్ నిర్ణయాలు:

టీమిండియా ఓటమికి ప్రధాన కారణం పేలవమైన కెప్టెన్సీ, టీమ్ మేనేజ్‌మెంట్. జట్టు ఏ ఆలోచనతో మైదానంలోకి వెళుతుందో అర్ధం కాదు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో పాటు ఫామ్‌లో లేని ఆటగాళ్లకు నిరంతరం అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో పాటు రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా యావరేజ్‌గా కనిపిస్తోంది. 2015 తర్వాత మరోసారి బంగ్లాదేశ్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఓడిపోవడానికి ఇదే కారణం.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..