గుజరాత్‌దే హవా.. ఆ 3 ఐపీఎల్ టీంలకు మొండిచేయి.. వన్డే స్వ్కాడ్‌లో ఏ ఫ్రాంచైజీ నుంచి ఎంతమంది ఉన్నారంటే?

India ODI Squad Afghanistan Series: అఫ్గానిస్తాన్‌తో జరిగే ఈ వన్డే సిరీస్ యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక సువర్ణావకాశం. సీనియర్ల ఫిట్‌నెస్ సమస్యలు, యువ రక్తం కలయికతో కూడిన ఈ భారత జట్టు, కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ముఖ్యంగా తొలిసారి జట్టులోకి వచ్చిన ముగ్గురు యువ ఆటగాళ్ల ప్రదర్శనపై అందరి కళ్లూ ఉన్నాయి.

గుజరాత్‌దే హవా.. ఆ 3 ఐపీఎల్ టీంలకు మొండిచేయి.. వన్డే స్వ్కాడ్‌లో ఏ ఫ్రాంచైజీ నుంచి ఎంతమంది ఉన్నారంటే?
Ipl 2026

Updated on: May 19, 2026 | 7:23 PM

India ODI Squad Afghanistan Series: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం అఫ్గానిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం 15 మందితో కూడిన టీమిండియాను ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టు ఎంపికలో ప్రస్తుత ఐపీఎల్ 2026 ప్రదర్శనలు స్పష్టమైన ప్రభావాన్ని చూపించాయి. అయితే ఈ జట్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీల వారీగా ఆటగాళ్ల ప్రాతినిధ్యం ఎలా ఉందో చూస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గుజరాత్ టైటాన్స్ నుంచి అత్యధికంగా నలుగురు..

ఈ వన్డే సిరీస్ జట్టులో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ నుంచి అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. భారత జట్టును ముందుండి నడిపించబోయే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. గాయం కారణంగా గత వన్డే సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, గుజరాత్ తరపున ఇంకా ఐపీఎల్ అరంగేట్రం కూడా చేయని యువ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు రావడం గమనార్హం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు.. ముగ్గురికి అవకాశం..

ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ముగ్గురు ఆటగాళ్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్, ఆపై ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన ఇషాన్ కిషన్ భారీ పునరాగమనం చేశాడు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా వన్డే జట్టులో తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక హైదరాబాద్ స్పిన్నర్ హర్ష్ దూబే ఈ ఐపీఎల్‌లో 8 వికెట్లతో రాణించడంతో, అతడికి తొలిసారి భారత జట్టులో అవకాశం కల్పించారు.

ముంబై, ఢిల్లీ, పంజాబ్ జట్ల నుంచి ఇద్దరు చొప్పున..

ముంబై ఇండియన్స్ నుంచి సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఎంపికైనప్పటికీ, వీరిద్దరి లభ్యత వారి ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుంది. రోహిత్ పిక్క కండరాల గాయంతో, పాండ్యా నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఎంపికయ్యారు. పంజాబ్ కింగ్స్ నుంచి ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు, ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా నియమించారు.

బెంగళూరు, లక్నోల నుంచి ఒక్కరే.. మూడు జట్లకు మొండిచేయి..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఒక్కడే జట్టులో ఉన్నాడు. లక్నో సూపర్ జయంట్స్ తరపున ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వికెట్ తీసి సంచలనం సృష్టించిన యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. కాగా, ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల నుంచి ఒక్క ఆటగాడికి కూడా ఈ 15 మంది జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us