AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK U19 Final: పాకిస్థాన్‌ను మట్టికరిపించి ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత్

IND vs PAK U19 Final: ఒమన్ వేదికగా జరిగిన అండర్-19 పురుషుల ఆసియా కప్ 2026 తుది సమరంలో భారత యువ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన అత్యంత ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి ఛాంపియన్‌గా అవతరించింది. నవంబర్ 14, శనివారం జరిగిన ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు చివరి వరకు హోరాహోరీగా తలపడ్డాయి.

IND vs PAK U19 Final: పాకిస్థాన్‌ను మట్టికరిపించి ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత్
Ind Vs Pak U19 Final (1)
Rakesh
|

Updated on: Nov 14, 2026 | 6:49 PM

Share

IND vs PAK U19 Final: అండర్‌-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత యువ జట్టు అద్భుతం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి తొమ్మిదోసారి అండర్‌-19 ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది. ఒక దశలో భారత జట్టు ఓటమి అంచుకు చేరినా.. కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ, ఆ తర్వాత మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా పోరాటంతో మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంది. గతంలో గ్రూప్ దశలో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంది.

పాక్ బ్యాటర్ల విధ్వంసం

టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ 111 బంతుల్లో 107 పరుగులతో సెంచరీ సాధించాడు. అబ్దుల్ ఖాదిర్ 54 బంతుల్లో 80 పరుగులు చేసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ 60 బంతుల్లో 63 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కావ్య పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా, చిరుగుపాటి వెంకట మూడు వికెట్లు తీశాడు. అర్జున్ రాజ్‌పుత్‌కు ఒక వికెట్ దక్కింది. దీంతో భారత్ ముందు 338 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.

ఆర్యవీర్ సెహ్వాగ్ హాఫ్ సెంచరీ

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆర్యవీర్ సెహ్వాగ్, కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ మంచి ఆరంభం ఇచ్చారు. ఆర్యవీర్ 61 బంతుల్లో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. చేతికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్నా క్రీజులో నిలబడి జట్టుకు అవసరమైన పరుగులు అందించాడు. మరోవైపు కెప్టెన్ లక్ష్య బాధ్యతాయుతంగా ఆడాడు. 101 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. అయితే కీలక సమయంలో వికెట్లు వరుసగా పడటంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అన్వయ్ ద్రవిడ్ 19 పరుగులు చేసి రనౌట్ కావడం జట్టుకు మరో ఎదురుదెబ్బగా మారింది.

9 వికెట్లు పడినా వెనక్కి తగ్గని మనల్, మోహిత్

కెప్టెన్ లక్ష్య ఔటైన తర్వాత భారత జట్టు కష్టాల్లో పడింది. మధ్యలో వరుస వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ విజయం ఖాయమని అనిపించింది. అయితే మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా చివరి వరకు పోరాడారు. మనల్ 32 బంతుల్లో 47 పరుగులు చేసి భారత విజయంపై ఆశలు పెంచాడు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 35 బంతుల్లో 57 పరుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. చివరి ఓవర్‌లో భారత్‌కు 8 పరుగులు అవసరమైన సమయంలోనూ ఉత్కంఠ కొనసాగింది. చివరకు భారత జట్టు లక్ష్యాన్ని అందుకుని ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది.

తొమ్మిదోసారి ఆసియా కప్

ఈ విజయంతో భారత్ అండర్‌-19 ఆసియా కప్‌ను తొమ్మిదోసారి గెలుచుకుంది. టోర్నీలో గ్రూప్ దశలో పాకిస్థాన్ చేతిలో ఓడిన భారత జట్టు.. ఫైనల్లో అదే ప్రత్యర్థిని ఓడించి టైటిల్ సాధించడం విశేషం. అంతకుముందు సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడిన యువ ఆటగాళ్లు భారత క్రికెట్ అభిమానులకు మరపురాని విజయాన్ని అందించారు.

Follow Us