
IND vs ENG 4th Test: క్రికెట్‌లో రికార్డులు సృష్టించడం, తిరగరాయడం సహజం. అయితే కొన్ని రికార్డులు మాత్రం ఏ జట్టు కూడా కోరుకోదు. ప్రస్తుతం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ అలాంటి ఓ అనవసరమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ టెస్టులో భారత ఓపెనర్లు సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్ ఇద్దరూ సున్నా పరుగులకే ఔట్ అయ్యి, 42 సంవత్సరాల క్రితం నమోదైన ఓ చెత్త రికార్డును సమం చేశారు.
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లిద్దరూ ఒక్క పరుగు కూడా చేయకుండా ఔటవడం ఇది రెండోసారి మాత్రమే. చివరిసారిగా 1983లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో సునీల్ గవాస్కర్, కృత్తి వెంకట్రాఘవన్ సున్నా పరుగులకే వెనుదిరిగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ టెస్టు మ్యాచ్‌లోనూ ఇలాంటి దుస్థితి భారత్‌కు ఎదురు కాలేదు. కానీ, మాంచెస్టర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్లు సాయి సుదర్శన్ (0), యశస్వి జైస్వాల్ (0) ఇద్దరూ ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో కేవలం రెండు బంతుల్లోనే వీరిద్దరిని ఔట్ చేయడం ఈ అరుదైన, అనవసరమైన రికార్డు నమోదైంది.
ఆశ్చర్యకరంగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 61 పరుగులు, యశస్వి జైస్వాల్ 58 పరుగులు చేసి భారత జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పూర్తిగా తడబడ్డారు. మొదటి ఓవర్ చివరి బంతికి జైస్వాల్, ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికి సుదర్శన్ ఔటవడంతో భారత శిబిరంలో ఆందోళన నెలకొంది.
చారిత్రాత్మక ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో భారత్‌కు టెస్టుల్లో రికార్డు అంత బాగాలేదు. ఇక్కడ ఇప్పటివరకు భారత్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఐదు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఈ నేపథ్యం, కీలకమైన సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడి ఉండటం, రెండో ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడం భారత జట్టుపై మరింత ఒత్తిడిని పెంచింది.
ప్రస్తుతం సిరీస్‌లో వెనుకబడిన భారత్, ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో ఉంది. అయితే, ఓపెనర్ల ఘోర వైఫల్యం జట్టుకు ఆశించిన ఆరంభాన్ని ఇవ్వలేకపోయింది. మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు ఎలా రాణిస్తారో, భారత్ ఈ ఒత్తిడిని తట్టుకుని నిలబడుతుందో లేదో చూడాలి. ఈ అనవసర రికార్డు భారత్ టెస్టు చరిత్రలో ఒక మరపురాని క్షణంగా నిలిచిపోతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..