IND vs NZ 2nd T20 : శాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్..టీమిండియా ముందు 209 పరుగుల భారీ లక్ష్యం
IND vs NZ 2nd T20 : రాయ్‌పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లను ఆరంభం నుంచే ఒత్తిడిలోకి నెట్టిన కివీస్, భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది.

IND vs NZ 2nd T20 : రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో పరుగుల వరద పారింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిర్ణయం మొదట్లో సరిగ్గానే అనిపించినా, కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (19), టిమ్ సైఫర్ట్ (24) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 3.2 ఓవర్లలోనే 43 పరుగులు జోడించి భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఈ ఇద్దరినీ త్వరగానే అవుట్ చేసి భారత్‌ను రేసులోకి తెచ్చారు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర (44) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. 26 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. గ్లెన్ ఫిలిప్స్ (19), డారిల్ మిచెల్ (18) కూడా కీలక పరుగులు జోడించారు. మధ్యలో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు తీసి కివీస్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. కానీ చివర్లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (46 నాటౌట్) క్రీజులో పాతుకుపోయి సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలర్ల పని పట్టాడు. అతనికి తోడుగా జాకరీ ఫౌల్క్స్ చివర్లో విలువైన పరుగులు జోడించడంతో న్యూజిలాండ్ స్కోరు 200 మార్కును దాటింది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా తలో వికెట్ దక్కించుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ తన కోటా ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇప్పుడు 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే భారత బ్యాటర్లు అసాధారణ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నుంచి మెరుపులు ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
