
టెస్ట్ క్రికెట్‌లోని 148 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ చూడని ఓ వింత, విషాదకరమైన రికార్డు టీమిండియా పేరిట నమోదైంది. ఇంగ్లండ్‌తో జరిగిన 2025 సిరీస్‌లోని మొదటి టెస్టులో, ఒకే మ్యాచ్‌లో ఐదుగురు భారత బ్యాటర్లు శతకాలతో చెలరేగినా, అంతిమంగా ఓటమిని చవిచూసిన మొట్టమొదటి జట్టుగా నిలిచి, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానం ఈ చారిత్రక ఘోర పరాజయానికి వేదికైంది.
తొలి ఇన్నింగ్స్‌లో పరుగుల సునామీ..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు పరుగుల వరద పారించింది. యువ సంచలనం యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (134) తొలి ఇన్నింగ్స్‌లోనే అద్భుత శతకాలతో కదం తొక్కారు. వీరి వీరవిహారంతో భారత్ 471 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ ప్రదర్శన చూశాక, ఇంగ్లండ్‌పై భారత్ సునాయాసంగా విజయం సాధిస్తుందని అందరూ భావించారు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీల మోత..
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 465 పరుగులకు కట్టడి చేసిన భారత్, స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈసారి సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (137), మరోసారి అద్భుతంగా ఆడిన రిషభ్ పంత్ (118) సెంచరీలతో చెలరేగారు. దీంతో, ఒకే టెస్టు మ్యాచ్‌లో భారత్ తరఫున మొత్తం ఐదు సెంచరీలు నమోదయ్యాయి. ఇది టెస్ట్ క్రికెట్‌లో అత్యంత అరుదైన ఘనత. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులు చేసి, ఇంగ్లండ్‌కు 371 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
ఊహించని పరాజయం..
అయితే, ఐదవ రోజు ఇంగ్లండ్ బ్యాటర్లు అసాధారణ పోరాట పటిమ కనబరిచారు. ఓపెనర్ బెన్ డకెట్ (149) వీరోచిత శతకానికి, జాక్ క్రాలీ (65), జో రూట్ (53*)ల కీలక ఇన్నింగ్స్‌లు తోడవడంతో ఇంగ్లండ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, భారత శిబిరాన్ని, అభిమానులను నివ్వెరపోయేలా చేసింది.
క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఒక మ్యాచ్‌లో ఐదు సెంచరీలు సాధించి ఓడిపోలేదు. 1928లో ఆస్ట్రేలియా నాలుగు సెంచరీలు నమోదు చేసి ఓటమి పాలైంది. కానీ, ఏకంగా ఐదు శతకాలు బాదిన తర్వాత కూడా ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ బాధాకరమైన రికార్డు, గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోవడం భారత జట్టుకు, అభిమానులకు ఎప్పటికీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. బ్యాటర్లు తమ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించినా, బౌలర్ల వైఫల్యం, ఫీల్డింగ్ తప్పిదాలు ఈ చారిత్రక పరాజయానికి కారణమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి