
IND vs ZIM: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయం టీమిండియాను ఆలోచనలో పడేసింది. ఈ ఓటమి నేర్పిన పాఠాలతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ ఇప్పుడు జట్టులో కీలక మార్పులకు సిద్ధమవుతున్నారు. సూపర్-8లో భారత్ తన తదుపరి పోరులో జింబాబ్వేను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎం.ఏ.చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరగనుంది. చెన్నై పిచ్ స్వభావం దృష్ట్యా భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు ఉండబోతున్నాయని సమాచారం.
చెపాక్ స్టేడియం అంటేనే స్పిన్నర్ల స్వర్గధామం. ఇక్కడ బంతి బాగా టర్న్ అవుతుంది కాబట్టి, భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ జట్టులోకి వస్తే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలం పెరుగుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. అలాగే ప్రత్యర్థి బ్యాటర్లను తన మాయాజాలంతో తిప్పికొట్టేందుకు చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కూడా తుది జట్టులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరోవైపు, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు జట్టుకు తలనొప్పిగా మారింది. ఈ వరల్డ్ కప్‌లో అతను వరుసగా విఫలమవుతుండటంతో, అతని స్థానంలో సంజూ శామ్సన్‌ను ఆడించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే కీలకమైన మ్యాచ్ కావడంతో అనుభవం లేని ప్రయోగాలు చేయకుండా, అభిషేక్ శర్మపైనే మేనేజ్మెంట్ మరోసారి నమ్మకం ఉంచేలా కనిపిస్తోంది. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకోనుండగా, బౌలింగ్ విభాగంలో కుల్దీప్ లేదా సుందర్‌లలో ఒకరికి చోటు దక్కవచ్చు.
జింబాబ్వేను తక్కువ అంచనా వేయడం భారత్‌కు ప్రాణసంకటమే. ఎందుకంటే గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి దిగ్గజ జట్లకే చెమటలు పట్టించి సూపర్-8కు చేరిన ఘనత ఆ జట్టుది. ముఖ్యంగా వారి స్పిన్నర్లు ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై పిచ్‌పై భారత్ ఎంతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. నెట్ రన్ రేట్ దెబ్బతినకుండా ఉండాలంటే, జింబాబ్వేపై భారీ విజయం సాధించడం సూర్య సేనకు అనివార్యం.
జింబాబ్వే పై భారత్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) :
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ / వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..