Vaibhav Suryavanshi : అదృష్టం ఊరించింది..దురదృష్టం వెక్కిరించింది..వైభవ్ సూర్యవంశీ వికెట్ వెనుక అసలు కథ

Vaibhav Suryavanshi : అండర్-19 వరల్డ్ కప్‌లో దాయాది దేశాల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Vaibhav Suryavanshi : అదృష్టం ఊరించింది..దురదృష్టం వెక్కిరించింది..వైభవ్ సూర్యవంశీ వికెట్ వెనుక అసలు కథ
Vaibhav Suryavanshi

Updated on: Feb 01, 2026 | 2:36 PM

Vaibhav Suryavanshi : అండర్-19 వరల్డ్ కప్‌లో దాయాది దేశాల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే బంతికి రెండుసార్లు అవుట్ నుంచి తప్పించుకున్నా, ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోలేక తర్వాతి బంతికే పెవిలియన్ చేరి అభిమానులను నిరాశపరిచాడు.

అండర్-19 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 30 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించాడు. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో జరిగిన డ్రామా అంతా ఇంతా కాదు. మహమ్మద్ సాయమ్ వేసిన ఆ ఓవర్ మూడో బంతికి వైభవ్ పుల్ షాట్ ఆడబోయాడు. బంతి బ్యాట్ పైభాగంలో తగిలి గాల్లోకి లేచింది. షార్ట్ మిడ్ వికెట్ వద్ద ఉన్న పాక్ ఫీల్డర్ హుజైఫాకు అది చాలా సులువైన క్యాచ్. కానీ అతను దాన్ని నేలపాలు చేశాడు.

అక్కడితో డ్రామా అయిపోలేదు. క్యాచ్ డ్రాప్ అవ్వగానే వైభవ్ రన్ కోసం పరిగెత్తాడు. అయితే నాన్ స్ట్రైకర్ ఆరోన్ జార్జ్ నిరాకరించడంతో వెనక్కి తిరగాల్సి వచ్చింది. అప్పటికే ఫీల్డర్ బంతిని వికెట్ల వైపు విసిరాడు. అక్కడ వికెట్ కీపర్ లేకపోవడం, డైరెక్ట్ హిట్ అవ్వకపోవడంతో వైభవ్ తృటిలో రనౌట్ ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నాడు. అంటే ఒక్క బంతిలోనే అతనికి రెండుసార్లు లైఫ్ దొరికింది. స్టేడియంలోని అభిమానులంతా వైభవ్ ఇక పాకిస్థాన్‌ను ఆడేసుకుంటాడని ఆశపడ్డారు.

కానీ విధి మరోలా ఉంది. ఆ తర్వాతి బంతికే వైభవ్ అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దొరికిన అదృష్టాన్ని అందిపుచ్చుకోకుండా బాధ్యతారహితంగా ఆడి పెవిలియన్ చేరాడు. వైభవ్ అవుట్ అవ్వగానే పాక్ ఆటగాళ్లు మైదానంలో సంబరాల్లో మునిగిపోయారు. ఈ షాక్ నుంచి భారత్ తేరుకోకముందే, అదే ఓవర్ చివరి బంతికి కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఆరోన్ జార్జ్ క్లీన్ బౌల్డ్ అవ్వడంతో భారత్ కేవలం 47 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..