టీ20 ప్రపంచ కప్ మహా సంగ్రామానికి తెర లేచింది. నేటి నుంచి ప్రారంభమైన 8వ ఎడిషన్‌లో ఎనిమిది టీంలు క్వాలిఫయర్ రౌండ్‌లో తలపడేందుకు సిద్ధమయ్యాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించిన సంగతి తెలిసిందే. ఈ రెండు గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 12లో చేరతాయి. ఇక క్వాలిఫయర్ పోటీలు ముగిసిన తర్వాత.. అసలు సమరం మొదలవనుంది. ఈ క్రమంలో టీమిండియా తన తొలి పోరును పాకిస్తాన్ టీంతో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 23న భారత్, పాక్ టీంలు మెల్‌బోర్న్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడయ్యాయి. అయితే, ఇంతలోనే ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఓ వార్త టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు క్రీడాభిమానులను కలవరపెడుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ మ్యాచ్ ఆగిపోయే అవకాశం ఉందని తెలవడంతో అభిమానులంతా నీరుగారిపోతున్నారు.
T20 ప్రపంచ కప్ 2022లో అక్టోబర్ 23న జరగనున్న భారత్-పాకిస్థాన్ గ్రేట్ మ్యాచ్ కోసం మెల్‌బోర్న్ వాతావరణం అంతా వేడెక్కింది. అయితే, ఆ రోజు మెల్‌బోర్న్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని, వర్షం ఆటను చెడగొడుతుందనే భయం నెలకొంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు కూడా అక్కడ వాతావరణం కూడా ఇలానే ఉండడం కూడా అభిమానులను కలవరపెడుతోంది.
IND vs PAK మ్యాచ్‌కి ముందు బ్యాడ్ న్యూస్..
వాతావరణ సూచన ఏజెన్సీ ప్రకారం, అక్టోబర్ 20 నుంచి ఆస్ట్రేలియాలోని 3 రాష్ట్రాలు వర్షంతో తీవ్రంగా ప్రభావితమవుతాయని తెలిపింది. ఈ సమయంలో అక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ మారిన వాతావరణం నుంచి మెల్బోర్న్ తప్పించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వాతావరణ సమాచార వెబ్‌సైట్ AccuWeather ప్రకారం, అక్టోబర్ 23 ఉదయం మెల్‌బోర్న్‌లో వర్షం పడవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండవచ్చు. కాగా అక్టోబర్ 22న, మ్యాచ్‌కు ఒకరోజు ముందు, ఆకాశం మేఘావృతమై, మధ్యాహ్నం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది కాకుండా, రోజంతా నిరంతరాయంగా వర్షం పడటం కూడా చూడవచ్చని తెలుస్తోంది.
అభిమానుల ఆశలు తడిసిముద్దవ్వాల్సిందేనా..
మ్యాచ్ ప్రారంభానికి 24 గంటలముందే మెల్ బోర్న్ వాతావరణ పరిస్థితులు అల్లకల్లోలంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్‌లో ఇలాంటివి ఏమీ జరగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వర్షం కారణంగా భారత్ – పాకిస్థాన్ గ్రేట్ మ్యాచ్ జరగకుంటే.. ఇరు జట్లకు చెరో ఒక పాయింట్ దక్కుతుంది. ఆరోజు ఏం జరుగుతుందో చూడాలి మరి.