IND vs ENG 2022: కామన్వెల్త్‌లో రజత పతకంతో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తాజాగా ఈ పర్యటనకు వెళ్లే జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. టీ20, వన్డే జట్ల కోసం వేర్వురుగా జట్లను ప్రకటించింది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి (Jhulan Goswami) తిరిగి జట్టులోకి రావడం ఈ ఎంపికలో హైలెట్. అదే సమయంలో యువ వికెట్ కీపర్ యాస్తిక భాటియాను T20 జట్టు నుంచి తొలగించారు.
రెండు మ్యాచ్‌లకే ఉద్వాసన..
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును సీనియర్ మహిళల సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అదే సమయంలో, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు 18 మంది సభ్యులను ఎంపిక చేశారు. వన్డే, టీ20 జట్లలో కొంతమంది ఆటగాళ్లను మినహాయిస్తే, చాలా మంది పేర్లు ఊహించినట్లుగానే ఉన్నాయి. శ్రీలంక టూర్ తర్వాత సీడబ్ల్యూజీలో మంచి ప్రదర్శన కనబరిచిన రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్‌లకు రెండు జట్లలోనూ స్థానం కల్పించారు. అలాగే ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో గాయపడిన జెమీమా రోడ్రిగ్స్‌ను కూడా రెండు జట్లలోనూ ప్లేస్ ఇచ్చారు. అత్యంత ముఖ్యమైనది యాస్తిక భాటియాకు విరామం. అయితే యంగ్ వికెట్ కీపర్ యాస్తిక భాటియాను జట్టు నుంచి తొలగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమెకు CWGలో కేవలం రెండు మ్యాచ్‌లలో అవకాశం లభించింది. వాటిలో పెద్దగా రాణించలేదు. అయితే కేవలం రెండు మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఆమెను తొలగించడం సమంజసం కాదంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. యాస్తిక స్థానంలో మరో యువ వికెట్ కీపర్ రిచా ఘోష్ జట్టులోకి రానుంది. ఇక కిరణ్ నవగిరేకు తొలిసారిగా టీ20 జట్టులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన నవగిరే నాగాలాండ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో అమోఘంగా రాణించింది. ఆమెతో పాటు ఆల్‌రౌండర్ డి హేమలత కూడా టీ20 జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
ఝులన్ రీ ఎంట్రీ..
కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవమున్న సీనియర్ బౌలర్ ఝులన్ గోస్వామిని జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే మరో విషయం. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు ఆమె కూడా వీడ్కోలు పలుకుతుందని భావించారు. అనుకున్నట్టుగానే మిథాలీ రిటైరైంది. దీంతో ఝులన్ కూడా ఆటకు గుడ్‌బై చెప్పనున్నారన్న వార్తలు వినిపించాయి. శ్రీలంక పర్యటనకూ దూరమైంది. అయితే అనూహ్యంగా ఇంగ్లండ్ పర్యటనకు ఆమెను ఎంపిక చేశారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య మొత్తం 6 మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న టీ20 సిరీస్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. కాగా, సెప్టెంబర్ 24న చారిత్రక లార్డ్స్ మైదానంలో జరిగే మూడో వన్డేతో పర్యటన ముగియనుంది.
ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత జట్టు
టీ20 జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, జెమీమా రోడ్రిగ్జ్, స్నేహ రాణా, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, రాధా యాదవ్, షబినేని మేఘనా, తానియా భాటియా, రాజేశ్వరి గైక్వాడ్, డి హేమలత, సిమ్రాన్ దిల్ బహదూర్, కిరణ్ నవ్గిరే
వన్డే జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, జెమీమా రోడ్రిగ్స్, స్నేహ రాణా, రేణుకా ఠాకూర్, మేఘనా సింగ్, షబ్బినేని మేఘన, తానియా భాటియా, యస్తికా భాటియా, రాజేశ్వరి, రాజేశ్వరి డి హేమలత, సిమ్రాన్ దిల్ బహదూర్, ఝులన్ గోస్వామి, హర్లీన్ డియోల్.
? NEWS ?: Team India (Senior Women) squad for England tour announced. #TeamIndia | #ENGvIND
More Details ?https://t.co/EcpwM3zeVO
— BCCI Women (@BCCIWomen) August 19, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..