
IND vs ENG : బ్రిటన్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్‌లలో వరుస పరాజయాలను చవిచూసిన భారత క్రికెట్ జట్టు, కనీసం వన్డే సిరీస్‌నైనా గెలిచి మంచి జ్ఞాపకాలతో పర్యటనను ముగించాలని భావిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14 నుంచి జూలై 19 వరకు జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో అందరి కళ్ళు రన్ మెషీన్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి తర్వాత కోహ్లీ మళ్లీ టీమిండియా జెర్సీలో కనిపించకపోవడంతో అభిమానులు ఆయన పునరాగమనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ, ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై తన ప్రతాపం చూపించడానికి సిద్ధమయ్యాడు.
కింగ్ కోహ్లీ సంచలన ప్రాక్టీస్ సీక్రెట్
ఈ కీలక వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు, భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బాంగర్ ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షోలో పాల్గొని విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ స్ట్రైల్స్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కోహ్లీ ప్రతి పెద్ద సిరీస్‌కు ముందు తనను సంప్రదించి, ప్రత్యేకంగా బ్యాటింగ్ సెషన్స్ ప్లాన్ చేసుకుంటాడని బాంగర్ తెలిపారు. ముంబై మైదానంలో ఉదయం 6 లేదా 6:30 గంటలకల్లా ఇద్దరం పిచ్‌పైకి చేరుకునేవాళ్లమని చెప్పారు. ఉదయాన్నే ఉండే మంచు వల్ల ఇంగ్లాండ్ వాతావరణం లాంటి కండిషన్స్ ఏర్పడతాయని, అందువల్లే అంత పొద్దున్నే ప్రాక్టీస్ చేసేవాళ్లమని బాంగర్ ఆ సీక్రెట్ వెల్లడించారు.
ఇంగ్లాండ్ పిచ్‌లపై స్వింగ్‌ను ఎదుర్కోవడం ఎలా?
ఇంగ్లాండ్ గడ్డపై సక్సెస్ కావాలంటే రెండు విషయాలు చాలా ముఖ్యమని సంజయ్ భంగర్ వివరించారు. ఒకటి.. బంతి స్వింగ్ అయ్యేటప్పుడు ఎలా ఆడాలి, రెండు.. బంతిని ఎంత ఆలస్యంగా డిఫెండ్ చేయాలి అనేది తెలియాలి. ఉదయం సమయం దాటి ఎండ పెరిగే కొద్దీ మంచు తగ్గిపోతుంది కాబట్టి, తాము పిచ్‌పై కావాలనే ఎక్కువ నీళ్లు చల్లేవాళ్లమని బాంగర్ చెప్పారు. నీళ్లు చల్లడం వల్ల బంతి విపరీతంగా మూవ్ అవుతుందని, అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కోహ్లీ వరుసగా 2 నుంచి 3 గంటల పాటు విరామం లేకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడని కొనియాడారు. తన బ్యాటింగ్‌లో చిన్న లోపం కూడా లేకుండా చూసుకునే వరకు కోహ్లీకి సంతృప్తి ఉండేది కాదన్నారు.
2014 ఘోర పరాజయం తర్వాత కోహ్లీ ఎలా తిరగబడ్డాడో తెలుసా?
విరాట్ కోహ్లీకి 2014 ఇంగ్లాండ్ పర్యటన ఒక పీడకల లాంటిది. ఆ టూర్‌లో కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ కసితోనే 2017-18 ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ అసాధారణమైన రీతిలో కష్టపడ్డాడని బాంగర్ గుర్తుచేశారు. ఆ కఠిన శ్రమకు అద్భుతమైన ఫలితం దక్కింది. ఆ పర్యటనలో కోహ్లీ 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో 59.30 సగటుతో ఏకంగా 593 రన్స్ చేసి, 2 సెంచరీలు కూడా బాదాడు. ఆ సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతేకాదు వన్డే సిరీస్‌లో కూడా 63.67 సగటుతో పరుగుల వరద పారించాడు. ఇప్పుడు మళ్లీ అదే తరహా కసితో కోహ్లీ ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..