IND vs ENG Lords Test: లార్ట్స్ టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరకపోయింది. నాలుగో రోజు బ్యాటింగ్ ఆరభించిన టీమిండియాకు ఆగస్టు 15 సెంటిమెంట్‌కు బలయ్యేలా కనిపిస్తోంది. అయితే మరోవైపు టీమిండియా ప్రధాన పేస్ బౌలర్ ఓ చెత్త రికార్డును నెలకొల్పడంతో భారత్‌కు లార్డ్స్ టెస్ట్ కలిసిరావడంలేదని అర్థమవుతోంది. టీమిండియాలో ఎక్కువ నోబాల్స్ వేసే బౌలర్‌గా జస్‌ప్రీత్ బుమ్రాకు పేరున్న సంగతి తెలిసిందే. అయితే ఆమధ్య బాగానే రాణించినా.. మరలా పాత సమస్య మొదలైనట్లే కనిపిస్తోంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రెండవ రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆడింది. ఇందులో బుమ్రా ఏకంగా 13 నోబాల్స్ వేశాడు. ఈ నేపథ్యంలో బుమ్రా ఓ చెత్త రికార్డును బ్రేక్ చేశాడు. బుమ్రా బద్దలు కొట్టింది కూడా మరో టీమిండియా బౌలర్ రికార్డే కావడం గమనార్హం. 2002లో జహీర్‌ఖాన్ వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 13 నోబాల్స్ సంధించాడు. దీని తరువాత మరే టీమిండియా బౌలర్ ఇన్ని నోబాల్స్ వేయలేదు. తాజాగా ఈ రికార్డును 19 ఏళ్ల తర్వాత బుమ్రా లార్డ్స్ టెస్టులో బ్రేక్ చేశాడు. దీంతో జహీర్‌తో సమానంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా 26 ఓవర్లు వేసి 79 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం.
మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా ఓపెనర్లతోపాటు కెప్టెన్ కూడా పెవిలియన్ చేరడంతో.. పీకల్లోతు కష్టాల్లో పడింది. నేడు నాలుగో రోజు కావడంతో టీమిండియా ఇంగ్లండ్ ముందుకు భారీ స్కోర్ ఉంచాలని అంతా అనుకున్నారు. కానీ, లంచ్‌కు ముందే ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్స్ ఔట్ అవ్వడంతో మిగతా ప్లేయర్లు ఎలా రాణిస్తారోననే ఆందోళన నెలకొంది. రాహుల్ (5) త్వరగా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. అనంతరం మంచి ఊపులో కనిపించిన రోహిత్ (21) కూడా నిరాశపరిచాడు. ఇక ఆదుకుంటాడనుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 20 పరుగులు చేసి సామ్ కరన్‌కు చిక్కాడు. టీమిండియా ప్రస్తుతం 29 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. పుజారా (3), రహానే (1) క్రీజులో నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 2, సామ్ కరన్ 1 వికెట్ పడగొట్టారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 180 నాటౌట్; 18 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ శతకం బాదేశాడు. జానీ బెయిర్‌స్టో 57 పరుగులతో (107 బంతులు, 7 ఫోర్లు) రాణించాడు. టీమిండియా బౌలర్లలో సిరాజ్ 4, ఇషాంత్ 3 వికెట్లు పడగొట్టారు. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది.