IND vs AFG : కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన గిల్.. తొలి ఇన్నింగ్స్ 564/8 వద్ద టీమిండియా డిక్లేర్డ్
IND vs AFG : ముల్లాంపూర్ టెస్ట్‌లో అఫ్గానిస్తాన్‌పై భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 564/8 వద్ద డిక్లేర్ చేసింది. మ్యాచ్ మొదటి రోజు ఆట పూర్తిగా భారత బ్యాటర్ల కంట్రోల్లోనే సాగింది. గిల్, రాహుల్ సెంచరీలతో మెరవగా.. అఫ్గాన్ బౌలర్ సలీమ్ 6 వికెట్లతో చరిత్ర సృష్టించాడు.

IND vs AFG : అఫ్గానిస్తాన్‌తో ముల్లాంపూర్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. పరుగుల వరద పారించింది. పటిష్టమైన బ్యాటింగ్ లైన్అప్‌తో బరిలోకి దిగిన భారత్.. తమ మొదటి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీలతో చెలరేగడంతో భారత్ ఈ భారీ స్కోరును సాధించగలిగింది.
మ్యాచ్ మొదటి రోజు ఆట పూర్తిగా భారత బ్యాటర్ల కంట్రోల్లోనే సాగింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించారు. అయితే 24 పరుగులు చేసిన జైస్వాల్‌ను అవుట్ చేయడం ద్వారా అఫ్గాన్ పేసర్ మహ్మద్ సలీమ్ భారత్‌కు మొదటి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్.. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 139 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాయి సుదర్శన్ 13 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేసి సెంచరీకి చేరువవుతున్న తరుణంలో మళ్లీ సలీమ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ పట్టుదలగా ఆడి తన టెస్ట్ కెరీర్‌లో మరో అద్భుత సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 11 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసిన రాహుల్.. జియౌర్ రెహమాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుతిరిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా సెంచరీ మార్కును దాటగా.. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 368 పరుగుల పటిష్ట స్థితిలో నిలిచింది.
రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత భారత్ స్కోరు బోర్డును మరింత వేగంగా పరిగెత్తించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 15 ఫోర్లు, 1 సిక్సర్‌తో 126 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి సలీమ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. గిల్ టెస్ట్ కెరీర్‌లో ఇది 10వ సెంచరీ కాగా, కెప్టెన్‌గా ఇది 6వ సెంచరీ కావడం విశేషం. మరోవైపు ధాటిగా ఆడిన రిషభ్ పంత్ 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 81 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. డెబ్యూ టెస్ట్ ఆడుతున్న మానవ్ సుతార్ 28 పరుగులు చేయగా, చివర్లో వాషింగ్టన్ సుందర్ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్ స్కోరును 550 దాటించాడు. ఆఖర్లో మహ్మద్ సిరాజ్ కూడా 12 బంతుల్లో 22 పరుగులు చేసి అలరించాడు. అనంతరం 127వ ఓవర్లో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
భారత బ్యాటర్లు కొండంత స్కోరు సాధించినప్పటికీ.. అఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సలీమ్ ఈ ఇన్నింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా సరే 5 వికెట్ల హాల్ సాధించిన మొదటి అఫ్గాన్ బౌలర్‌గా సలీమ్ రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో సలీమ్ మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్ వికెట్లను తన ఖాతాలో వేసుకుని అఫ్గాన్ జట్టులో టాప్ పర్ఫార్మర్‌గా నిలిచాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
