Fifa World Cup 2022: ఖతార్‌లో ఆదివారం డిసెంబర్ 18న జరిగిన FIFA వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం సాధించి, మూడో టైటిల్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా సారథి లియోనల్ మెస్సీపైనే అందరి చూపులు నిలిచాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మ్యాచ్‌తో మెస్సీ తన ప్రపంచ కప్ ప్రయాణానికి కూడా వీడ్కోలు కూడా తెలిపాడు. ఇక ఫైనల్లో మెస్సీ అద్భుత ఆటకు ముగ్దులైన చాలా మంది క్రికెటర్లు.. ప్రశంసలు కురిపించారు. అయితే, వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్లో ఓ పోస్ట్ చేసి, ఆకట్టుకున్నాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
అర్జెంటీనా ప్రపంచ కప్ విజయంపై స్పందిస్తూ, సెహ్వాగ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక మెమ్‌ను పంచుకున్నాడు. మెస్సీ భారత్‌లో పుట్టి ఉంటే, ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వెంటనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఉండేవాడని సూచించాడు.
అనుభవజ్ఞుడైన ఈ ఫుట్‌బాల్ ఆటగాడు ఫైనల్ గేమ్‌లో రెండు గోల్స్ కొట్టాడు. పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మార్చడం ద్వారా టోర్నమెంట్‌లో ఏడు గోల్స్ చేసి, రెండో స్థానంలో నిలిచాడు.
ఫైనల్లో అర్జెంటీనా 4-2తో పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించడంతో 35 ఏళ్ల మెస్సీ.. తన మొట్టమొదటి ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకున్నాడు.
ఈ పోటీలో అర్జెంటీనా కెప్టెన్ ఏడు గోల్స్ చేయడంతో పాటు మూడు అసిస్ట్‌లతో చెలరేగడం గమనార్హం. టోర్నమెంట్ అంతటా గాయంతో బాధపడినా.. అసాధారణ ప్రదర్శనతో అర్జెంటీనా జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో కీలక పాత్ర పోషించిన మెస్సీ గోల్డెన్ బాల్ ట్రోఫీని అందుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..