
ICC vs PCB : టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో ఆడటానికి నిరాకరించడం, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ చేర్చడంపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా స్పందించారు. ఐసీసీది డబుల్ స్టాండర్డ్ అని, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని ఆయన బహిరంగంగా విమర్శించారు. అంతేకాకుండా పాకిస్థాన్ ప్రభుత్వం చెబితే తాము కూడా వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటామని, అప్పుడు ఐసీసీ 22వ జట్టును వెతుక్కోవాల్సి ఉంటుందని మైండ్ గేమ్ ఆడారు.
నఖ్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా, ఒకవేళ పాకిస్థాన్ గనుక వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తే ఆ దేశంపై ఎన్నడూ లేని విధంగా కఠిన ఆంక్షలు విధించేందుకు ఐసీసీ సిద్ధమైంది. అవే గనుక అమలులోకి వస్తే పాకిస్థాన్ క్రికెట్ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఐసీసీ విధించాలనుకుంటున్న ప్రధాన ఆంక్షలు ఇవే
ద్వైపాక్షిక సిరీస్‌ల రద్దు: ఇతర దేశాలతో పాకిస్థాన్ ఆడే సిరీస్‌లను పూర్తిగా నిలిపివేయడం.
ఆసియా కప్ నుంచి బహిష్కరణ: ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి పాక్‌ను తొలగించడం.
పీఎస్‌ఎల్‌కు చెక్: పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడే విదేశీ ఆటగాళ్లకు వారి వారి క్రికెట్ బోర్డుల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రాకుండా చూడటం. దీనివల్ల పీఎస్‌ఎల్ క్రేజ్ పూర్తిగా తగ్గిపోతుంది.
ఆర్థిక ఆంక్షలు: ఐసీసీ నుంచి పాకిస్థాన్‌కు అందే నిధులను నిలిపివేయడం.
మొహ్సిన్ నఖ్వీ ఈ విషయంలో తన పట్టు వీడటం లేదు. బంగ్లాదేశ్ ఒక పూర్తి స్థాయి ఐసీసీ సభ్య దేశమని, పాకిస్థాన్, భారత్ జట్లకు గతంలో హైబ్రిడ్ మోడల్ వర్తింపజేసినప్పుడు, బంగ్లాదేశ్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఐసీసీ మాత్రం భద్రతా కారణాలపై స్వతంత్ర సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం భారత్‌లో ఎటువంటి ముప్పు లేదని స్పష్టం చేస్తోంది.
ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చాక పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ మొండిగా ముందుకెళ్తే మాత్రం పాకిస్థాన్ క్రికెట్ కోలుకోలేని దెబ్బ తినడం ఖాయమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.