ICC world cup 2023: ఫైనల్‌లో పరాజయం.. గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టిన టీమిండియా క్రికెటర్లు.. ఎమోషనల్‌ వీడియో

|

Nov 19, 2023 | 11:08 PM

బహుశా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా కొంతమంది జట్టు ఆటగాళ్లకు ఇది చివరి వన్డే ప్రపంచ కప్. సొంత మైదానంలో వరల్డ్‌ కప్‌ టైటిల్‌ను ముద్దాడాలని ఎన్నో కలలు కన్నారు. కానీ ఆదివారం ఆ కలలు కల్లలయ్యాయి. దీంతో టీమిండియా క్రికెటర్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఫైనల్స్ వరకు అజేయంగా జట్టును నడిపించిన రోహిత్ కన్నీళ్లు పెట్టుకుంటూ మైదానాన్ని వీడడం అభిమానులను కలచివేసింది

ICC world cup 2023: ఫైనల్‌లో పరాజయం.. గ్రౌండ్‌లోనే కన్నీళ్లు పెట్టిన టీమిండియా క్రికెటర్లు.. ఎమోషనల్‌ వీడియో
Team India
Follow us on

ఈసారి ఎలాగైనా ప్రపంచకప్‌ టైటిల్‌ గెలవాన్న కల కలగానే మిగిలిపోయింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా జట్టు కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.ప్రపంచకప్‌లో వరుసగా 10 విజయాలు సాధించిన టీమిండియా ఫైనల్స్‌లో చతికిలపడింది. బహుశా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో సహా కొంతమంది జట్టు ఆటగాళ్లకు ఇది చివరి వన్డే ప్రపంచ కప్. సొంత మైదానంలో వరల్డ్‌ కప్‌ టైటిల్‌ను ముద్దాడాలని ఎన్నో కలలు కన్నారు. కానీ ఆదివారం ఆ కలలు కల్లలయ్యాయి. దీంతో టీమిండియా క్రికెటర్లు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఫైనల్స్ వరకు అజేయంగా జట్టును నడిపించిన రోహిత్ కన్నీళ్లు పెట్టుకుంటూ మైదానాన్ని వీడడం అభిమానులను కలచివేసింది. రోహిత్‌ పాటు కోహ్లీ సహా పలువురు ఆటగాళ్లు మైదానంలో కన్నీరుమున్నీరయ్యారు. ఒకానొక సమయంలో కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్.. చివరకు దుఃఖాన్ని ఆపుకోలేక మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు వేగంగా వెళ్లిపోయాడు. గత నెల రోజులుగా ఈ ఒక్క టైటిల్ కోసం జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ రోహిత్ ప్రదర్శన అసాధారణం. కానీ చివరి దశలో టైటిల్ కోల్పోయామన్న నైరాశ్యం కెప్టెన్ రోహిత్ ముఖంలో స్పష్టంగా కనిపించింది.

ఇక భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన లక్ష మంది ప్రేక్షకుల ముఖాల్లోనూ దిగులు, బాధ కనిపించింది. మైదానంలో మన ఆటగాళ్లను చూసిన ప్రేక్షకులు సైతం కన్నీటి పర్యంతం అయ్యారు. ఆటగాళ్లతో పాటు అభిమానులు బోరున విలపించిన దృశ్యాలు స్క్రీన్ పై కనిపించడంతో మైదానమంతా ఉద్వేగమైన వాతావరణం కనిపించింది. మొత్తం టోర్నీలో జట్టును విజయపథంలో నడిపించడమే కాకుండా, ఆటగాడిగా రోహిత్ చిరస్మరణీయ ప్రదర్శన చేశాడు. మొత్తం టోర్నీలో, విరాట్ కోహ్లీ 765 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ కూడా 597 పరుగులతో కోటను నిర్మించాడు. అయితే మొత్తం పోటీలో మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, ముగింపు ఆశించినంతగా లేదు. నిర్ణయాత్మక మ్యాచ్‌లో శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా విఫలమయ్యారు. టీమిండియా నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. జట్టులో ట్రావిస్ హెడ్ భారీ సెంచరీ (120 బంతుల్లో 137) చెలరేగగా, మార్నస్ లాబుస్చాగ్నే (58) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ అభేద్యమైన మూడో వికెట్‌కు 194 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. భారత్‌ తరఫున బుమ్రా 2 వికెట్లు తీయగా, షమీ, సిరాజ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

ఇవి కూడా చదవండి

రోహిత్ కన్నీళ్లు..

ఓటమిని జీర్ణించుకోలేకపోయిన హిట్ మ్యాన్..

 ఫ్యాన్స్ ఎమోషనల్..

మేమంతా.. మీ వెంటేనంటోన్న ఫ్యాన్స్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..