
ఆసియా కప్ 2025లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరిగిన మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అనేక నిబంధనలను ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోనుందని సమాచారం. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను ఆసియా కప్‌ను ICC తొలగించకపోవడంపై పాకిస్థాన్ టీమ్ నిరసన తెలిపింది. అతన్ని టోర్నీ నుంచి పంపిస్తేనే యూఏఈతో మ్యాచ్ ఆడుతామంటూ అలిగి కూర్చున్నారు. దీంతో బుధవారం పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. అయితే ఈ టాస్‌కి ముందు జరిగిన ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) మీటింగ్‌లో ప్రోటోకాల్ ఉల్లంఘనలను పేర్కొంటూ PCBకి ICC ఒక అధికారిక ఇమెయిల్ పంపింది.
ICC CEO సంజోగ్ గుప్తా PCBని ఉద్దేశించి మాట్లాడుతూ.. మ్యాచ్ రోజున పదేపదే PMOA ఉల్లంఘనలను ఎత్తి చూపారు. అనేక హెచ్చరికలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ వారి మీడియా మేనేజర్ నయీమ్ గిలానీని టాస్‌కు ముందు పైక్రాఫ్ట్, ప్రధాన కోచ్ మైక్ హెస్సన్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మధ్య జరిగిన సమావేశాన్ని చిత్రీకరించడానికి అనుమతించింది. ఇది ICC నిబంధనల ప్రకారం కచ్చితంగా నిషేధించిన అంశం. మీడియా మేనేజర్లు అటువంటి చర్చలకు హాజరు కావడానికి అనుమతి లేదు, అలాగే PMOA లోపల వీడియో షూట్ చేయడం కూడా నేరం.
సెప్టెంబర్ 14న జరిగిన టాస్‌కు సంబంధించిన మునుపటి సమస్యను పరిష్కరించడానికి, ఏవైనా అపార్థాలుంటే తొలగించే లక్ష్యంతో ICC, PCB ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అయితే PCB తమ మీడియా మేనేజర్‌ను కూడా చేర్చాలని పట్టుబట్టింది, మీటింగ్‌కు మొబైల్ ఫోన్ తీసుకురావడానికి ప్రయత్నించినందుకు ICC అవినీతి నిరోధక మేనేజర్ మొదట్లో అతనికి ప్రవేశం నిరాకరించారు. మ్యాచ్ నుంచి వైదొలుగుతామని బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఐసీసీ అయిష్టంగానే మీడియా మేనేజర్‌కు ఆడియో లేకుండా హాజరు కావడానికి, సంభాషణను రికార్డ్ చేయడానికి అనుమతించింది.
అయితే వీడియోను పోస్ట్ చేస్తూ మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పాడని తప్పుగా పేర్కొన్న PCB మీడియా ప్రకటనను ICC విమర్శించింది. అతను తప్పుగా సంభాషించినందుకు మాత్రమే విచారం వ్యక్తం చేశాడు. తదుపరి సమావేశాలలో చిత్రీకరణపై కఠినమైన PMOA నిబంధనల కారణంగా PCB మీడియా సిబ్బందికి ప్రవేశం నిరాకరించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి