ICC T20 World Cup : టి20 వరల్డ్ కప్‌లో భారీ మార్పులు.. 20 నుంచి 24కు జట్ల సంఖ్యను పెంచేందుకు ఐసీసీ ప్లాన్

ICC T20 World Cup : టీ20 వరల్డ్‌కప్‌ను మరింత విస్తరించేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న 20 జట్ల స్థానంలో 2032 నుంచి 24 జట్లను చేర్చే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అసోసియేట్ దేశాలకు ఇది భారీ అవకాశాలను తెరుచుకోనుంది.

ICC T20 World Cup : టి20 వరల్డ్ కప్‌లో భారీ మార్పులు.. 20 నుంచి 24కు జట్ల సంఖ్యను పెంచేందుకు ఐసీసీ ప్లాన్
Icc T20 World Cup

Updated on: Jul 28, 2026 | 11:13 AM

ICC T20 World Cup : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను మరింత విస్తరించేందుకు భారీ ప్లాన్ రెడీ చేస్తోంది. ప్రస్తుతం 20 జట్లతో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో జట్ల సంఖ్యను ఏకంగా 24కు పెంచే ఆలోచనలో ఐసీసీ ఉంది. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. భారత్, శ్రీలంక వేదికలుగా జరిగిన 2026 ఎడిషన్ భారీ విజయాన్ని సాధించడంతో ఐసీసీ ఈ దిశగా అడుగులు వేగవంతం చేసింది. భవిష్యత్తులో ఈ టోర్నీని ఏకంగా 32 జట్లతో నిర్వహించడమే ఐసీసీ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది.

2032 నుంచే కొత్త రూల్ అమలు

అయితే ఈ కొత్త మార్పులు వెంటనే అమల్లోకి రావు. రాబోయే రెండు టీ20 వరల్డ్ కప్ ఎడిషన్లు పాత ఫార్మాట్ ప్రకారమే జరగనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికలుగా జరిగే 2028 వరల్డ్ కప్‌తో పాటు 2030 ఎడిషన్‌లో కూడా ప్రస్తుతం ఉన్న 20 జట్ల ఫార్మాట్‌నే కొనసాగించనున్నారు. ఒకవేళ 24 జట్ల ప్రతిపాదనకు బోర్డు ఆమోదం లభిస్తే, అది 2032 ఎడిషన్ నుంచే అధికారికంగా అమలు కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది.

అసోసియేట్ దేశాలకు గోల్డెన్ ఛాన్స్

క్రికెట్‌ను ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రీడగా మార్చేందుకు టీ20 ఫార్మాట్‌ను ఐసీసీ ఒక ముఖ్యమైన సాధనంగా భావిస్తోంది. ముఖ్యంగా 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ మళ్లీ చేరనున్న నేపథ్యంలో.. ఈ ప్రపంచకప్ విస్తరణ చిన్న దేశాలకు చాలా ప్రయోజనకరంగా మారనుంది. గతంలో 2022 వరకు 16 జట్లు మాత్రమే ఆడగా, 2024 నుంచి ఆ సంఖ్యను 20కి పెంచారు. దీనివల్ల అమెరికా, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వంటి కొత్త దేశాలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటుకునే అవకాశం దక్కింది.

ఐసీసీ ముందున్న సవాళ్లు

వరల్డ్ కప్‌లో జట్ల సంఖ్యను పెంచడం వల్ల అసోసియేట్ దేశాలకు అవకాశాలు పెరిగినప్పటికీ, ఐసీసీకి ఇది పెద్ద సవాలుగా మారనుంది. టోర్నమెంట్ షెడ్యూల్, మ్యాచుల సంఖ్య, ప్రసార హక్కులు, సరైన వేదికలను నిర్వహించడం నిర్వాహకులకు సంక్లిష్టమైన పని. అయితే దశలవారీగా ఈ విస్తరణను చేపట్టి మొదట 24 జట్లను చేర్చడం ద్వారా వచ్చే ఫలితాలను బట్టి 32 జట్లకు చేరుకోవాలని ఐసీసీ భావిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us