India vs Australia: అప్పుడు కంగారూలు.. కంగారెత్తించారు.. ఇప్పుడు మనోళ్లు పిచ్చెక్కిస్తారా? మరికొన్ని గంటల్లోనే మెగా ఫైట్‌..

ICC Cricket World Cup 2023 Final: 2003 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఓటమి.. కొన్ని ఏళ్ల వరకు అభిమానులను పీడించింది. ఈసారి మాత్రం తగ్గేదే లే అంటున్నారు టీమిండియా ఆటగాళ్లు. రెండేళ్ల ముందునుంచే ప్రిపరేషన్‌ మొదలుపెట్టారంటే.. ఈ వరల్డ్‌కప్‌ కోసం ఎంత శ్రమించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకే కాదు.. 2003లో టీమిండియా సభ్యుడిగా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌కు ఈ వరల్డ్‌కప్‌ ఎంతో ప్రతిష్టాత్మకం..

India vs Australia: అప్పుడు కంగారూలు.. కంగారెత్తించారు.. ఇప్పుడు మనోళ్లు పిచ్చెక్కిస్తారా? మరికొన్ని గంటల్లోనే మెగా ఫైట్‌..
India Vs Australia
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 19, 2023 | 9:35 AM

ICC Cricket World Cup 2023 Final: 2003 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఓటమి.. కొన్ని ఏళ్ల వరకు అభిమానులను పీడించింది. ఈసారి మాత్రం తగ్గేదే లే అంటున్నారు టీమిండియా ఆటగాళ్లు. రెండేళ్ల ముందునుంచే ప్రిపరేషన్‌ మొదలుపెట్టారంటే.. ఈ వరల్డ్‌కప్‌ కోసం ఎంత శ్రమించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకే కాదు.. 2003లో టీమిండియా సభ్యుడిగా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌కు ఈ వరల్డ్‌కప్‌ ఎంతో ప్రతిష్టాత్మకం.. ఇది ప్యూర్‌ రివేంజే. వెంజెన్స్‌ ఎలా ఉంటుందో.. గ్రడ్జ్‌తో ఎలా కొట్టాలో.. ఈరోజు భారత ఆటలో కనపడబోతోంది. ఈ వరల్డ్‌కప్‌లో మన ఆటతీరు అంతా చూస్తూనే ఉన్నారు. ప్రతీ మ్యాచ్‌లో మినిమం 9మంది ఆటగాళ్లు పెర్ఫామ్‌ చేస్తున్నారు. ఒకరు కాకపోతే ఇంకొకరు అనే పరిస్థితి నుంచి.. ఒకరి తర్వాత ఒకరు.. ఒకర్ని మించి ఇంకొకరు ఆడుతున్నారు. ఓపెనర్ల సమస్యలేదు, టాప్‌ ఆర్డర్‌ టాప్‌ లేపుతోంది. మిడిల్‌ ఆర్డర్‌ మస్తు హుషారుగా ఉంది. బౌలర్ల సంగతి స్పెషల్‌గా మెన్షన్‌ చేయాల్సిన అవసరం లేనే లేదు. మనోళ్లు మామూలోళ్లు కాదు. ఆకలిమీదున్న సింహాలు. పదేళ్లుగా ఐసీసీ టైటిల్‌ లేకుండా వస్తున్నాం. ఈసారి ఆ దాహం తీరాల్సిందే. కంగారూల ఖేల్‌ ఖతం చేయాల్సిందే.

మన ముందున్న ప్రధాన బలం.. సమిష్టి కృషి. కోచ్‌ నుంచి.. కెప్టెన్‌, ప్లేయర్స్‌ వరకు అంతా ఒక మాటపై ఉంటున్నారు. ఒకే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నో కఫ్యూజన్‌. సింపుల్‌ క్రికెట్‌ అన్న రీతిలో మన జట్టు ఆటతీరు ఉంది. రాహుల్‌ వ్యూహాలు.. రోహిత్‌ అమలు చేస్తున్న తీరు అభినందనీయం. ఆస్ట్రేలియాకి బిగ్గెస్ట్‌ ఫియర్‌.. విరాట్‌ కోహ్లీ. అతడి ఫామ్‌ చూస్తేనే అందరికీ భయమేస్తోంది. రోహిత్‌ వేగంగా ఆడి వెళ్లిపోతే.. కోహ్లీ చాపకింద నీరులా ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. మిగిలిన బ్యాటర్లకు సహకరిస్తూనే.. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో మన అప్రతిహత విజయాలకు విరాట్‌ కోహ్లీ మెయిన్‌ రీజన్‌. అతడు మరో ఎండ్‌లో ఉంటే.. మిగిలిన బ్యాటర్లకు ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ అలా ఆడుతున్నారంటే.. విరాటుడు మరో ఎండ్‌లో ఉన్నాడనే భరోసానే. చాలామంది అనుకోవచ్చు.. కోహ్లీ సెంచరీల కోసమే అడుతున్నాడని. కాని.. అతడు సెంచరీ చేసిన ఓ మ్యాచ్‌లోనూ మనం ఓడలేదు. ఈ టోర్నీలో పది వన్డేలు భారత్‌ ఆడితే.. ఎనిమిది మ్యాచ్‌లలో 50కి పైగా పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నీలో కోహ్లీ.. 100 యావరేజ్‌తో.. 711 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు కూడా. అయితే.. ఈ జట్టులో వరల్డ్‌ ఫైనల్‌ ఆడిన అనుభవం ఎవరికైనా ఉందా అంటే.. అది విరాట్‌ కోహ్లీకి మాత్రమే. 2011 టీమ్‌లో కోహ్లీ సభ్యుడిగా ఉన్నాడు. అప్పుడు మన కప్పు గెలిచాం. ఇప్పుడూ ఉన్నాడు.. ఈసారి కూడా గెలుస్తామని కొందరు ఫ్యాన్స్‌ ముందే ఉత్సాహంతో ఉన్నారు.

మిడిల్‌లో శ్రేయస్‌, రాహుల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా అయ్యర్‌ రెండు వరుస సెంచరీలు బాది ఉత్సాహంతో ఉన్నాడు. సెమీస్‌లో కివీస్‌పై వీరబాదుడు ఇంకా ఎవరూ మర్చిపోలేదు. తనకున్న లోపాలను సవరించుకుంటూ వస్తున్న అయ్యర్‌.. ఫైనల్లోనూ చెలరేగిపోయే సూచనలున్నాయి. రాహుల్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. తన ఆడుతున్న తక్కువ బంతుల్లోనే పెద్ద షాట్లతో అలరిస్తున్నాడు. మన అదృష్టమో.. మరేదో గాని.. ఇప్పటివరకు లోయర్‌ ఆర్డర్‌పై పెద్దగా బర్డెన్‌ పడలేదు. అయినాగాని.. రవీంద్ర జడేజా రెండు మూడు మ్యాచ్‌లలో మెరిశాడు. ఫైనల్లో చాన్స్‌ వస్తే హోంగ్రౌండ్‌లో దంచడానికి రెడీగా ఉన్నాడు.

వీడియో చూడండి..

బౌలింగ్‌లో స్పెషల్‌గా చెప్పాల్సింది ఏమీ లేదు. మహ్మద్‌ షమీ.. ఈ ఒక్క పేరు చాలు. ప్రత్యర్థుల ప్యాంట్లు తడిచిపోడానికి. ఈ టోర్నీలో కేవలం 6 మ్యాచ్‌లే ఆడిన షమీ.. 23 వికెట్లు తీశాడు. అందులో మూడు సార్లు 5కి పైగా వికెట్లను పడగొట్టాడు. సెమీస్‌లో కివీస్‌ పిట్టను నలిపి ఇంటికి పంపించాడు. మన విజయాల్లో షమీది ప్రముఖపాత్ర. షమీ ఎకానమీ కేవలం ఐదే. యావరేజ్‌ అయితే.. అందరికన్నా బెస్ట్‌. అంతకు మించి ఏంటంటే.. ఐపీఎల్‌లో షమీ గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఆడుతున్నాడు అంటే.. అహ్మదాబాద్‌ పిచ్‌ మనోడికి సెకండ్‌ హోమ్‌ లాంటిది. దీంతో షమీపై గంపెడు ఆశలున్నాయి. ఇక బుమ్రా కూడా మంచి ఓపెనింగ్‌ ఇస్తున్నాడు. ఓపెనర్లలో కనీసం ఒక వికెట్ అయినా రాబడుతున్నాడు. అయితే సిరాజ్‌ని పక్కనబెట్టి ఇంకో స్పిన్నర్‌ని బరిలో దించే అవకాశాలున్నాయి. అయితే దీనికి పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. హార్దిక్‌ లేకపోవడంతో స్టాండ్‌బై పేసర్‌లోటు కనిపిస్తోంది. అయితే మాజీకోచ్‌ రవిశాస్త్రి మాత్రం.. టీమ్‌ను డిస్టర్బ్‌ చేయొద్దని అంటున్నాడు. దీంతో ఈరోజు టీమ్‌ కూర్పు ఎలా ఉండబోతోందో చూడాలి. స్పిన్నర్‌ కుల్దీప్‌ జోరు కొనసాగిస్తే.. మనకు తిరుగుండదు.

వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమ్‌ ఉందంటే.. ప్రత్యర్థులకు హడలే. వాళ్లు ఫైనల్‌కి వస్తే కప్‌ ఎగరేసుకుని వెళ్తారన్న ఆందోళన మన అభిమానుల్లో ఉంది. అయితే ఈసారి ఆ సెంటిమెంట్‌ను రివర్స్‌ చేస్తారన్న నమ్మకమూ ఉంది. 2003 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత్‌ ఓడింది. ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యాన్ని కనబర్చింది. ఫైనల్లో అనుభవలేమి వల్ల అలా జరిగిందని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆ టెన్షన్‌ ఏమీలేదు. మనోళ్లు రకరకాల ఫార్మాట్లలో రకరకాల టోర్నీలు ఆడుతూవస్తున్నారు. ప్రత్యర్థులను ఎలా హ్యాండిల్‌ చేయాలో కూడా తెలుసు. 2003లో బౌలింగ్‌ అంత పటిష్టంగా లేదు. బ్యాటింగ్‌లోనూ సచిన్‌, సెహ్వాగ్‌, గంగూలి, ద్రవిడే ఆడాలి. మిడిల్, లోయర్‌ ఆర్డర్‌ అంతంత మాత్రమే. దీంతో ఆస్ట్రేలియా వారినే టార్గెట్‌ చేసి గెలిచింది. ఇప్పుడున్న ఆస్ట్రేలియా కూడా అదే వ్యూహంతో వెళ్తుందా? ఎలా పెర్ఫామ్‌ చేస్తుందనేది ఆసక్తికరం. వార్నర్‌ నుంచి కమిన్స్‌ వరకు అంతా బ్యాటర్లే. బౌలింగ్‌లో స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, కమిన్స్‌, జంపా ప్రమాదకరం. వారికి సమర్ధంగా ఎదుర్కోవాలి. ఈ టోర్నీ ప్రారంభమ్యాచ్‌లోనే ఆసీస్‌, భారత్‌ తలపడ్డాయి. అప్పుడు మనం గెలిచాం. ఆసీస్‌ను చిత్తు చేశాం. కాని అప్పటికి ఇప్పటికీ ఆస్ట్రేలియా జట్టు పుంజుకుంది. ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ.. ఫైనల్‌కు చేరుకున్న ఆ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఆసీస్‌తో అంత ఈజీకాదు. మనళ్లూ అంత ఈజీగా మ్యాచ్‌ని చేజారనివ్వరు. మరి ఈరోజు మ్యాచ్‌ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..