‘ధోని తర్వాతే దేశం.. ఆయన కోసమే ఆడాను’: సంచలన వ్యాఖ్యలు చేసిన సురేష్ రైనా.. ఫైర్ అవుతోన్న నెటిజన్లు..

|

Feb 06, 2023 | 9:45 PM

Ms Dhoni vs Suresh Raina: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆగస్టు 15, 2020న రిటైరయ్యాడు. అదే రోజు సురేష్ రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.

ధోని తర్వాతే దేశం.. ఆయన కోసమే ఆడాను: సంచలన వ్యాఖ్యలు చేసిన సురేష్ రైనా.. ఫైర్ అవుతోన్న నెటిజన్లు..
Raina Dhoni
Follow us on

ఏ ఆటగాడైనా క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు ఏదో ఒక రోజు తన దేశం తరపున ఆడాలని కలలు కంటుంటారు. దేశాన్ని గెలిపించడమే తమ ముందున్న లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ప్రపంచ ఛాంపియన్ ఆటగాడు మొదట తన కెప్టెన్ కోసం ఆడానని, ఆ తర్వాత దేశం కోసం ఆడానని చెబితే.. ఆశ్చర్యపోవాల్సిందే. మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించి భారత మాజీ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం
హాట్‌టాపిక్‌గా మారింది. ఆ తర్వాత ధోనీ దేశం కంటే ముఖ్యమా అనే ప్రశ్న తలెత్తింది.

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సురేశ్ రైనా ఎంత సన్నిహితంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. టీమ్ ఇండియా అయినా, చెన్నై సూపర్ కింగ్స్ అయినా వీళ్ల స్నేహం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రైనా ఎప్పుడూ ధోనీని అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. ధోని నా అత్యంత సన్నిహితుడని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రకటన చాలా మందికి నచ్చడంలేదు.

రైనా కీలక స్టేట్మెంట్..

మహేంద్ర సింగ్ ధోని 15 ఆగస్టు 2020న రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సురేష్ రైనా కూడా రిటైరయ్యాడు. స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడిన రైనా దీనికి కారణాన్ని వివరించాడు. ‘నేను, ధోనీ కలిసి చాలా మ్యాచ్‌లు ఆడాం. ధోనీతో కలిసి ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్‌ల తరపున మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం నా అదృష్టం. మా ఇద్దరికీ అభిమానుల నుంచి ఎంతో ప్రేమ లభించింది. నేను ఘజియాబాద్ నుంచి, అయన రాంచీ నుంచి వచ్చాడు. నేను మొదట ధోనీ కోసం ఆడాను. తర్వాత నా దేశం కోసం ఆడాను. ఇదొక ప్రత్యేక సంబంధం. మేం చాలా ఫైనల్స్ ఆడాం. ప్రపంచ కప్ కూడా గెలిచాం. అతను అద్భుతమైన కెప్టెన్, మానవుడు’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్‌కు రైనా గుడ్‌బై..

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున రైనా చాలా కాలం ఆడాడు. అయితే, 2021లో జరిగిన మెగా వేలంలో ఈ ఆటగాడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతని కోసం వేలం వేయలేదు. ఆ తర్వాత రైనా వ్యాఖ్యనంలో బిజీగా మారిపోయాడు. ఇటీవల, అతను ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత అతను ఇప్పుడు ప్రపంచంలోని ఇతర టీ20 లీగ్‌లలో సందడి చేస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..